సింగపూర్ విమానంలో తీవ్ర అల్లకల్లోలం! కుదుపులతో ఒకరు మృతి, 30 మందికి పైగా గాయాలు
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర అల్లకల్లోలం ఏర్పడింది. దీంతో విమానం తీవ్ర కుదుపుల నడుమ అత్యవసర ల్యాండింగ్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర అల్లకల్లోలం ఏర్పడింది. దీంతో విమానం తీవ్ర కుదుపుల నడుమ అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ కుదుపుల కారణంగా ఒకరు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. వివరాల్లోకి వెళితే.. లండన్ నుంచి సింగపూర్ వెళ్తుండగా తీవ్ర కుదుపులకు గురైన బోయింగ్ 777 విమానం మంగళవారం బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నారని, కుదుపుల కారణంగా ఒకరు మృతి చెందారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. కానీ ఎంత మంది గాయపడ్డారో మాత్రం ఎయిర్‌లైన్స్ వెల్లడించలేదు.
ఈ క్రమంలోనే మృతుడి కుటుంబానికి సంతాపం సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంతాపం తెలియజేస్తూ తాజాగా ట్వీట్ చేసింది. అయితే, ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడినట్లు థాయ్ మీడియా నివేదికలు చెబుతున్నాయి. గాయాల పాలైన వారిని అంచనా వేయడానికి వైద్య సిబ్బంది విమానం ఎక్కారని, అయితే వారి సంఖ్యను నిర్ధారించలేమని, గాయపడని కొందరు ప్రయాణికులను దించారని థాయ్ ఇమ్మిగ్రేషన్ పోలీసులు తెలిపారు.