భారత్ గొప్ప శక్తివంతమైన దేశం: రష్యా

భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం బయట శక్తుల ప్రభావం లేకుండా సొంతంగా తన భాగస్వాములను ఎన్నుకునే గొప్ప శక్తివంతమైన దేశం అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు

Update: 2024-07-18 06:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం బయట శక్తుల ప్రభావం లేకుండా సొంతంగా తన భాగస్వాములను ఎన్నుకునే గొప్ప శక్తివంతమైన దేశం అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం న్యూయార్క్ పర్యటనలో ఉన్న ఆయన విలేఖరుల సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో ఇంధన సహకారం కారణంగా భారత్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని మాకు తెలుసు. కానీ భారత్ సొంత ప్రయోజనాల కోసం తన భాగస్వామిని ఎంచుకునే శక్తిని కలిగి ఉందని అన్నారు.

జులై నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి రష్యా అధ్యక్షత వహిస్తున్నందున, మాస్కో అధ్యక్షతన జరుగుతున్న కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహించడానికి సెర్గీ లావ్రోవ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మోడీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కూడా లావ్రోవ్ తప్పుబట్టారు. ఉక్రెయిన్ చేసిన వ్యాఖ్యలు అర్థవంతమైనవని అన్నారు.

అంతకుముందు 22వ భారత్ - రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ జులై 8-9 తేదీల్లో రష్యాలో అధికారిక పర్యటన చేశారు. ఉక్రెయిన్ వివాదం మొదలైన తర్వాత మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత రక్తపాతానికి పాల్పడుతున్న వ్యక్తిని కౌగిలించుకోవడం చాలా నిరాశ కలిగించిందని మోడీ-పుతిన్ సమావేశం గురించి జెలెన్‌స్కీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ కూడా ఇటీవల తన అసంతృప్తిని తెలియజేసింది.


Similar News