Russia vs USA : రష్యా సంచలన నిర్ణయం.. తమ దేశంలోకి రాకుండా 92 అమెరికన్లపై నిషేధం

రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-30 22:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి ప్రవేశించకుండా 92 అమెరికన్లపై నిషేధం విధించిన వార్త తాజాగా వెలుగులోకొచ్చింది. ఈ విషయాన్ని రష్యన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గత బుధవారం ప్రకటించింది. నిషేధించిన వారిలో గతంలో రష్యాలో పనిచేసిన కొంతమంది జర్నలిస్టులు అలాగే వ్యాపారవేత్తలు ఉన్నారు."మాస్కోపై వ్యూహాత్మక ఓటమి" అనే ప్రకటిత లక్ష్యంతో బైడెన్ పరిపాలన అనుసరించిన రస్సోఫోబిక్ కోర్సుకు ప్రతిస్పందనగా నిషేధాలు విధించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది.నిషేధం విధించిన వారందరు రష్యాకు వ్యతిరేకంగా అలాగే రష్యా దేశ ఆర్మీ గురించి ఫేక్ వార్తలు రాశారని అందుకే వారిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది.

కాగా నిషేధించబడిన అమెరికన్ల జాబితాలో వాల్ స్ట్రీట్ జర్నల్ యొక్క 11 మంది సిబ్బంది ఉన్నారు. అందులో వాల్ స్ట్రీట్ జర్నల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎమ్మా టక్కర్‌ కూడా ఉన్నారు.కాగా ఎమ్మా టక్కర్‌ WSJ రిపోర్టర్ ఇవాన్ గెర్ష్‌కోవిచ్ యొక్క అరెస్ట్ పై రష్యాను పదేపదే విమర్శించింది.అయితే గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో రష్యా అతన్ని 16 నెలలుగా జైలులో ఉంచింది. అతను ఈ ఆగస్టులో జైలు నుంచి విడుదల అయ్యాడు. అలాగే కైవ్ బ్యూరో చీఫ్ ఆండ్రూ క్రామెర్‌తో సహా ఐదుగురు న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులతో పాటు ది వాషింగ్టన్ పోస్ట్‌కు చెందిన నలుగురు జర్నలిస్ట్ లపై కూడా రష్యా నిషేధం విధించింది. నిషేదిత జాబితాలో ఉన్న వారిలో విద్యావేత్తలు, వ్యాపారాలు కూడా ఉన్నారు. కాగా రష్యా ఇప్పటివరకు 2,000 మందికి పైగా అమెరికన్లను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


Similar News