అమెరికా అండతోనే మాపై ఉక్రెయిన్ దాడులు : రష్యా

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా, రష్యా మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

Update: 2024-06-24 18:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా, రష్యా మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. తాజాగా సోమవారం తమ దేశంలోని అమెరికా రాయబారి లీన్‌ ట్రేసీకి రష్యా విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఉక్రెయిన్ పక్షాన నిలుస్తూ ఈ యుద్ధంలో అమెరికా కూడా ఒక భాగంగా మారిందని లీన్‌ ట్రేసీకి రష్యా విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అమెరికా సైనిక నిపుణుల సహాయం లేకుండా మిస్సైళ్లు, డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్ ఇంతటి భీకర దాడులను చేయలేదని వెల్లడించాయి. ‘‘రష్యా భూభాగంపై అమెరికా ఆయుధాలతో ఉక్రెయిన్ దాడులు చేస్తున్నందున అమెరికా కూడా సమాన బాధ్యత వహించాలి. మా భూభాగంపై దాడులకు ప్రతీకార చర్యలు తప్పవు’’ అని రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ హెచ్చరిక చేసిన కాసేపట్లోనే పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన క్షిపణులు, ఇతర ఆయుధాలను నిల్వ ఉంచిన ఉక్రెయిన్‌ మిలిటరీ లాజిస్టిక్‌ కేంద్రంపై రష్యా ఆర్మీ దాడి చేసింది. అయితే అది ఎక్కడనేది వెల్లడించలేదు. అంతకుముందు రష్యా, క్రిమిమయాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో ఉక్రెయిన్ జరిపిన వరుస దాడుల్లో ఆరుగురు చనిపోగా, 150 మంది గాయపడ్డారు.


Similar News