Nepal: నేపాల్‌లో ఇద్దరు భారతీయుల అరెస్ట్.. అక్రమంగా నగదు తరలిస్తుండగా పట్టివేత
నేపాల్‌లో అక్రమంగా రూ.20 లక్షలకు పైగా నగదును తరలిస్తున్న ఇద్దరు భారతీయులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్‌లో అక్రమంగా రూ.20 లక్షలకు పైగా నగదును తరలిస్తున్న ఇద్దరు భారతీయులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారిని మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన సల్మాన్ క్వారేసియా, ఉమేష్ సఖారామ్ ఖండాగ్లేగా గుర్తించారు. నేపాల్ భారత్ సరిహద్దులో భద్రతా తనిఖీల్లో భాగంగా వారు పట్టుబడ్డట్టు వెల్లడించారు. కపిల్వాస్తు జిల్లాలోని కృష్ణానగర్ ప్రాంతంలో వారిని అరెస్టు చేశారు. భారత నంబర్ ప్లేట్లు ఉన్న ప్రత్యేక వాహనాల్లో వీరు నగదును తరలిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి ఆధారం లేకుండా వారి వద్ద ఉన్న మొత్తం రూ.20,50,000లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తులను, రికవరీ చేసిన నగదును కపిల్వాస్తు జిల్లాలోని రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ విభాగానికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నేపాల్‌లో సరైన పత్రాలు లేకుండా రూ. 25,000 కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లడం చట్టవిరుద్ధం కావడం గమనార్హం.