గాజాలో అభివృద్ధి 70 ఏళ్ల వెనక్కి

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం పాలస్తీనా ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తున్నది. ముఖ్యంగా గాజా పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఇక్కడ దాదాపు ప్రజలంతా పేదరికంలోకి జారిపోయారని, ఆరోగ్యం, విద్య వంటి నాణ్యమైన జీవిత సూచికల్లో గాజా 70 ఏళ్లు వెనక్కి వెళ్లిందని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ మంగళవారం వెల్లడించింది.

Update: 2024-10-22 17:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం పాలస్తీనా ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తున్నది. ముఖ్యంగా గాజా పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఇక్కడ దాదాపు ప్రజలంతా పేదరికంలోకి జారిపోయారని, ఆరోగ్యం, విద్య వంటి నాణ్యమైన జీవిత సూచికల్లో గాజా 70 ఏళ్లు వెనక్కి వెళ్లిందని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ మంగళవారం వెల్లడించింది. యూఎన్‌డీపీ ఓ సంచలన అధ్యయనం చేపట్టింది. యూఎన్‌డీపీకి చెందిన చితోస్ నొగుచీ మాట్లాడుతూ.. కొన్ని అంశాల ఆధారంగా గాజాలో పేదరికం వంద శాతానికి సమీపిస్తున్నదని, నిరుద్యోగిత రేటు 80 శాతానికి పెరిగిందని తెలిపారు. పాలస్తీనా కనీవినీ ఎరుగని రీతిలో కుంటుపడిపోతున్నదని జెనీవాలోని యూఎన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. గాజాలో అభివృద్ధి వెనక్కి మళ్లిందని, సుమారు 70 ఏళ్లు అంటే 1959వ సంవత్సరానికి పడిపోయిందని చెప్పారు.

ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 40కి మించి ప్రజలు మరణించినట్టు అక్కడి వైద్యారోగ్య వర్గాలు తెలిపాయి. ఈ మరణాలు ఎక్కువగా గాజా ఉత్తర ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. రోజు వ్యవధిలో లెబనాన్‌లో కనీసం 63 మంది ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని, దీంతో మొత్తం మరణాల సంఖ్య 2530కు చేరిందని లెబనాన్ ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ఉత్తర గాజాలోని ప్రజలు ఇక్కడి నుంచి తరలివెళ్లడానికి అవకాశమిచ్చేలా తాత్కాలికంగానైనా ఇజ్రాయెల్ దాడులను విరమించాలని ఐరాస పాలస్తీనా రిఫ్యూజీ ఏజెన్సీ మంగళవారం విజ్ఞప్తి చేసింది. గత మూడు వారాలుగా గాయపడిన పౌరులకు చికిత్స అందించడానికి ఔషధాలు నిండుకున్నాయని పేర్కొంది.

Tags:    

Similar News