Manmohan Singh: అమెరికా- భారత్ ప్రగతికి పునాది వేశారు.. మన్మోహన్ సింగ్ మృతి పట్ల అమెరికా సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతిపట్ల అమెరికా సంతాపం తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతిపట్ల అమెరికా సంతాపం తెలిపింది. అమెరికా- భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని(India-US relations) బలోపేతం చేసేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(US Secretary of State Antony Blinken) అన్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇరు దేశాలు సాధించిన ప్రగతికి ఆయన పునాది వేశారని కొనియాడారు. అమెరికా, భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంతో మన్మోహన్ నాయకత్వం కీలకంగా మారిందన్నారు. భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు ఎల్లవేళలా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం తెలియజేశారు.
పౌర అణు ఒప్పందం
ఇకపోతే, మన్మోహన్‌సింగ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం ప్రత్యేకమైంది. దేశ విదేశాంగ విధానంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అమెరికా నుంచి అణు ఇంధన లభ్యత, పౌర అణు సాంకేతికతలో సహకారం సహా ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ఈ ఒప్పందం కార్యరూపం దాల్చేలా మన్మోహన్ కృషి చేశారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్యూ. బుష్‌తో కలిసి మన్మోహన్‌సింగ్ 2005 జూలై 18న పౌర అణు ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలపై సంయుక్త ప్రకటన చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని యూపీఏ–1 సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షమైన వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వానికి తలనొప్పిగా మారినా లెక్కచేయకుండా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ తర్వాత విశ్వాస పరీక్ష నెగ్గి మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. అయితే, 2008 అక్టోబర్‌లో అణు ఒప్పందం కార్యరూపం దాల్చింది.