Drugs Smuggling : కొకైన్‌ నింపేసి.. 90 క్యాప్సూల్స్‌ మింగేసి.. దొరికిపోయిన స్మగ్లర్

దిశ, నేషనల్ బ్యూరో : 90 క్యాప్సూల్స్‌లో కొకైన్‌ను ప్యాక్ చేయించి.. వాటిని మింగేసి స్మగ్లింగ్(Drugs Smuggling) చేసేందుకు యత్నించిన ఫిలిప్పీన్స్ జాతీయుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

Update: 2024-12-27 18:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో : 90 క్యాప్సూల్స్‌లో కొకైన్‌ను ప్యాక్ చేయించి.. వాటిని మింగేసి స్మగ్లింగ్(Drugs Smuggling) చేసేందుకు యత్నించిన ఫిలిప్పీన్స్ జాతీయుడిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇథియోపియాలోని అడిస్ అబాబా నుంచి బ్యాంకాక్ మీదుగా అతడు ఢిల్లీకి వచ్చినట్లు గుర్తించారు. ఎయిర్‌పోర్టులోని మూడో టెర్మినల్‌లో కస్టమ్స్(Customs) విభాగానికి చెందిన గ్రీన్ ఛానల్‌లో ఆ వ్యక్తిని తనిఖీ చేయగా... శరీరంలో డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. అతడిని అధికారులు విచారించగా.. తాను డ్రగ్స్‌తో నింపిన క్యాప్సూల్స్‌ను మింగానని ఒప్పుకున్నాడు. అనంతరం ఆ వ్యక్తిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు సర్జరీ చేసి పొట్టలోని 90 క్యాప్సూల్స్‌ను బయటికి తీశారు. వాటిలో కొకైన్ డ్రగ్స్ ఉన్నాయని తేలింది. వాటన్నింటి బరువు దాదాపు 676 గ్రాములు ఉంటుందని, ఆ డ్రగ్స్ విలువ రూ.10.14 కోట్ల దాకా ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. డ్రగ్స్ స్మగ్లింగ్ అభియోగాలతో అతడిని అరెస్టు చేశారు.

వియత్నాం డ్రగ్స్ ముఠాలోని 27 మందికి మరణశిక్ష

కంబోడియా నుంచి వియత్నాంకు డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలోని 27 మందికి వియత్నాంలోని ఓ కోర్టు మరణశిక్షను విధించింది. ముఠాలోని మిగతా 8 మందికి ఇరవై ఏళ్ల జైలుశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష వంటి శిక్షలను విధించారు. ఈమేరకు శుక్రవారం రోజు సంచలన తీర్పును కోర్టు వెలువరించింది. 2018 మార్చి నుంచి 2022 నవంబరు మధ్యకాలంలో ఈ డ్రగ్స్ ముఠా 626 కేజీల డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసిందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ముఠా సప్లై చేసిన డ్రగ్స్ జాబితాలో హెరాయిన్, కెటామైన్, మెథాంఫెటమైన్ వంటివి ఉన్నాయట. ఈ మాఫియాలో కీలక పాత్ర పోషించిన ఒక మహిళా గ్యాంగ్ లీడరుకు కూడా మరణశిక్ష పడిందని సమాచారం.

Tags:    

Similar News