Disha Special Story: The Six Triple Eight.. జాతి వివక్షను కళ్లకు కట్టిన చిత్రం
యుద్ధకాలంలో వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఈ నిజమైన చరిత్రను ఇన్నాళ్లకు ప్రపంచం కళ్ల ముందు నిలిపిన హృద్యమైన మానవీయ కథా చిత్రం 'ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్'
రెండో ప్రపంచ యుద్ధ కాలం. అమెరికన్ సైనికులు, వారి కుటుంబాల మధ్య మూడు సంవత్సరాలుగా బట్వాడా కాకుండా పెండింగులో ఉన్న కోటీ 75 లక్షల ఉత్తరాల పంపిణీని పరిష్కరించడానికి 855 మంది నల్లజాతి సైనిక మహిళలు యుద్ధ ప్రయత్నంలో చేరారు. వివక్ష, యుద్ధం రేపిన విధ్వంస పరిస్థితులు ఉన్నప్పటికీ, వారు షెడ్యూల్ కంటే ముందే తమకు అప్పగించిన పనిని పూర్తి చేస్తారు. పెండింగులో ఉన్న పదిహేడు మిలియన్ల ఉత్తరాలను క్రమబద్ధీకరిస్తారు. అడుగడుగునా తమ పట్ల శ్వేతజాతి అధికారులు వివక్ష ప్రదర్శిస్తున్నా తమ కెప్టెన్ నాయకత్వంలో అసాధారణ కృషితో అద్భుత విజయాన్ని సాధిస్తారు. యుద్ధకాలంలో వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఈ నిజమైన చరిత్రను ఇన్నాళ్లకు ప్రపంచం కళ్ల ముందు నిలిపిన హృద్యమైన మానవీయ కథా చిత్రం 'ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్'. - రాజశేఖర్ రాజు
ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (The Six Triple Eight) 2024లో టైలర్ పెర్రీ రచించి దర్శకత్వం వహించిన అమెరికన్ వార్ డ్రామా చలనచిత్రం, ఇది 1944లో రెండో ప్రపంచ యుద్ద కాలంలో అమెరికాలో ఏర్పడిన 6888వ సెంట్రల్ పోస్టల్ డైరెక్టరీ మహిళా బెటాలియన్‌పై వచ్చిన తాజా సినిమా. పూర్తిగా నల్లజాతివారితో కూడిన మహిళల బెటాలియన్ ఇది. తెల్లజాతి అధికారులు తమ పట్ల చూపించిన ఘోరమైన వివక్ష, యుద్ధం సృష్టించిన విధ్వంసకరమైన పరిస్ధితుల మధ్య ఈ బెటాలియన్ మహిళలు తమపై సైన్యాధికారులు మోపిన అసాధ్యమైన పనిని పట్టుదలతో చేపట్టి ఒక కోటీ 70 లక్షల ఉత్తరాలను సైనికులకు, వారి కుటుంబాలకు కేవలం 90 రోజులలోపే పంపించి అమెరికన్ సైనికుల, వారి కుటుంబాల నైతిక ధృతిని నిలబెట్టారు. ఈ బెటాలియన్ చరిత్రను వివరించే నిజమైన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.
అద్భుతమైన వాస్తవ కథ
యుద్ధంలో పోరాడుతున్న వారికి, స్వదేశానికి తిరిగి వచ్చిన వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చిన సిక్స్ ట్రిపుల్ ఎయిట్‌లోని మహిళలకు సినీ ప్రేమికులు నీరాజనాలు పలుకుతున్నారు. ఇది నిజంగానే ఒక అద్భుతమైన వాస్తవ కథకు కల్పించిన నాటకీకరణ. సినిమా చివరలో రిటైర్డ్ సైనికులతో చూపిన ఇంటర్వ్యూ ఈ చిత్ర నిర్మాణానికి రియల్ టైమ్ అనుభూతిని కల్పించింది. అమెరికన్ సైన్యానికి చెందిన 6888 రెజిమెంట్, నల్లజాతి మహిళా సైనికుల బెటాలియన్. రెండో ప్రపంచ యుద్ధం చివరలో వారు సాగించిన అద్భుతమైన పనిని దశాబ్దాలుగా అమెరికాలో విస్మరించారు. దశాబ్దాల తర్వాత ఈ నల్లజాతి మహిళా సైనికులు చాలా ఆలస్యంగా వారికి అర్హమైన గౌరవాలను అందుకున్నారు. జాత్యహంకారంతో బుసలు కొట్టే అమెరికన్ శ్వేతిజాతి సైనిక నాయకత్వం యుద్దకాలంలోనే ఈ మహిళా రెజిమెంటుపై తీవ్ర శత్రుత్వం ప్రదర్శించింది. అలివిమాలిన పనిని వారి భుజాలపై పెట్టి వారు విఫలమయ్యేలా పరిస్థితులను సృష్టించిన సైనిక నాయకత్వం ప్రయత్నాలకు ఎదురొడ్డిన ఈ రెజిమెంట్ మహిళలు చివరకు అద్భుతమైన విజయం సాధించారు.
సమానత్వం కోసం పోరాటం
జాత్యహంకారాన్ని, లింగ వివక్షను అధిగమించడంలో ఈ మహిళా సైనికులు 80 ఏళ్ల క్రితం ప్రదర్శించిన పట్టుదల అసాధారణమైనది. తమ పనిలో సమాన గుర్తింపుకోసం, పనిస్థలంలో గౌరవం, సమాన ప్రాతినిధ్యం కోసం నేడు మహిళలు కొనసాగిస్తున్న పోరాటానికి ఇది అద్దం పడుతుంది. అమెరికన్ రాజకీయాలు, సైన్యంలో సెక్సిజం వంటి చర్చను పక్కనబెట్టి స్త్రీలందరూ తప్పక చూడవలసిన సినిమా ఇది. ఈ మహిళా బెటాలియన్‌కు నాయకత్వం వహించిన కెర్రీ వాషింగ్టన్, జే రీవ్స్ ఆద్యంతం తమ పాత్రలకు వన్నె తెచ్చారు. సినిమా పొడవునా నెలకొన్న నాటకీయ పరిణామాలను ఎంత సహజాతి సహజంగా చిత్ర దర్శకుడు పెర్రీ తీశాడంటే ఎవరైనా ఈ సినిమా చూసి అనుభూతి చెందవలసిందే. హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక వివక్షా వ్యతిరేక సినిమా చివరలో ఇంతగా కన్నీళ్లు తెప్పిస్తుందని నేను ఊహించలేకపోయాను. ఇది నల్లజాతి మహిళా శక్తిని రగిలించిన సినిమా. జాత్యహంకారం, సెక్సిజం, అగౌరవం, తమ విలువను పూర్తిగా కించపర్చడం వంటి వాటిపై పోరాడడం. మహిళలు తమను తాము నమ్మి, కలిసి నిలబడినప్పుడు, తమ సామర్థ్యాలను తెలుసుకుని సవాల్‌ని స్వీకరించినప్పుడు అంతిమంగా వారు సామూహికంగా గర్వపడేలా పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వందల కోట్లు కుమ్మరించి భయంకరమైన మసాలాలన్నీ గుప్పించి ప్రేక్షకులను అన్ని రకాలుగా చావబాదుతున్న మన చిల్లరమల్లర సినిమాల లాంటిది కాదీ చిత్రం.
మాజీ సైనికుల నీరాజనం
డిసెంబర్ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను అమెరికాలో ఆర్మీ వెటరన్లు చూసి తాము చూసిన అత్యుత్తమ చిత్రంగా కొనియాడటం విశేషం. అమెరికన్ చరిత్ర ప్రస్తావించని సత్యాన్ని ఈ సినిమా ద్వారా చూడాలని వారు నొక్కి చెబుతున్నారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన కథను కలిగిన ఈ అద్భుతమైన సినిమా ఒక అందమైన చారిత్రక చిత్రం, ఒక ఆర్మీ కెప్టెన్ (కెర్రీ వాషింగ్టన్) తన చారిత్రాత్మకమైన మహిళా సైనికుల బెటాలియన్‌కి నాయకత్వం వహిస్తుంది, రెండవ ప్రపంచ యుద్ధంలో ఏకైక ఉమెన్స్ ఆర్మీ కార్ప్స్ యూనిట్ కెప్టెన్ కెర్రీ వాషింగ్టన్ నేతృత్వంలో వారు ఇతర మిషన్‌ల కంటే భిన్నంగా ఒక మిషన్‌ను ఎదుర్కొంటారు. 855 మంది మహిళలు డెలివరీ చేయని సైనికుల ఉత్తరాలకు సంబంధించిన మూడేళ్ల బకాయిలను పరిష్కరించేందుకు యుద్ధంలో చేరారు. ఆ తర్వాత ఏమైంది? సినిమా ఆద్యంతం చూసి ఎవరికి వారు అనుభూతి చెందాల్సిందే. ఒకనాడు చరిత్రలో నిజంగా జరిగిన వివక్షాత్మక కథను ప్రపంచానికి నేటికైనా చెప్పినందుకు, చూపినందుకు ఈ సినిమా తీసిన, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిందే! ఆనాటి తమ సేవా భావాలను, ధైర్యసాహసాలను, ఈ స్త్రీలు అనుభవించిన వాటిని అధిగమించాలనే సంకల్పాన్ని వ్యక్తీకరించడానికి పదాలు లేవు. ఈ సినిమా చూస్తుంటేనే కన్నీళ్లు! బెటాలియన్ కెప్టెన్‌గా కెర్రీ వాషింగ్టన్ నటన చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది వెండితెరపై ఒక నల్ల అమ్మాయి సృష్టించిన మాయాజాలం! నిజంగా కూడా నల్లజాతి స్త్రీలు దృఢంగా, శక్తిమంతంగా ఉంటారు. ఏ దేశంలో అయితేనేం.. మన చరిత్రను, మన పూర్వీకుల గాథను సెలబ్రేట్ చేసుకోవడం, వారిని ఇన్నాళ్లకైనా గౌరవించడం చాలా అందమైన విషయం! సాయుధ శిక్షణ పొందినప్పటికీ ఆయుధం పట్టని యుద్దంలో తపాలా సేవా కార్యకలాపాలను ఒక మహిళా రెజిమెంట్ యుద్ధం నడుమనే సాగించిన కొత్త చరిత్రకు ఇది దృశ్య రూపం.
చారిత్రక వాస్తవం.. 6888
నల్లజాతి మహిళా సైనికుల విషాద జీవన నేపథ్యాలు, తీవ్ర కష్టాల నడుమనే ప్రేమ కోసం వారు పడే ఆరాటాలు, కాసిన్ని నవ్వులు. వాటి మధ్యే కన్నీళ్ళను చిప్పిల్ల జేసే తీవ్రమైన విషాద దృశ్యాలు... ప్రపంచ యుద్ధం సమయంలో జీవితం ఎంత కష్టతరంగా ఉండేదో ఊహించడానికి కూడా సాధ్యం కాని మనకు, జీవించిన ప్రత్యక్ష సాక్షితో కథ చెప్పించిన వివక్షా వ్యతిరేక గాథ ఇది. సినిమా కళ ఎంత గొప్పదో దృశ్యమానం చేసే చారిత్రక వాస్తవాల కోసం 'ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్' సినిమాను చూద్దాం.
సినిమా: ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (The Six Triple Eight)
థియేటర్లలో విడుదల : డిసెంబర్ 6
ఓటీటీ: నెట్‌ప్లిక్స్, డిసెంబర్ 20 (తెలుగుతో సహా అన్ని భాషల్లో చూడవచ్చు)
నటీనటులు: కెర్రీ వాషింగ్టన్, జే రీవ్స్, ఎబోనీ అబ్సిడియన్, సారా జెఫ్రీ, ఓప్రా విన్ ఫ్రే, మొరియా బ్రౌన్, మిలౌనా జాక్సన్ తదితరులు
దర్శకుడు: టైలర్ పెర్రీ
ఆధారం: ఫైటింగ్ ఎ టూ-ఫ్రంట్ వార్ నవల
నెట్ ప్లిక్స్ సౌకర్యం లేనివాళ్లు థర్డ్ పార్టీ సైట్లలో కూడా చూడవచ్చు.