Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ గౌరవార్ధం సీడబ్ల్యూసీ ప్రత్యేక తీర్మానం

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌(Manmohan Singh) గౌరవార్ధం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక తీర్మానం చేసింది.

Update: 2024-12-27 17:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌(Manmohan Singh) గౌరవార్ధం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక తీర్మానం చేసింది. ‘‘మన్మోహన్ నిజమైన రాజనీతిజ్ఞుడు.. ఆయన జీవితం, దేశం కోసం చేసిన కార్యాలు భారతావని బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాయి’’ అని ఆ తీర్మానంలో కొనియాడారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రధాన కార్యాలయంలో జరిగిన సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ‘‘దేశ రాజకీయ, ఆర్థిక రంగాల్లో మన్మోహన్ శిఖర సమానుడు. భారతదేశ(India) పురోగతి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆయన ప్రపంచ ఖ్యాతిని గడించారు. కరుణ, నీతి, నిజాయితీ, నిబద్ధతలను కలిగిన గొప్ప రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్’’ అని తీర్మానంలో ప్రస్తావించారు. ‘‘ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం వంటివన్నీ మన్మోహన్ హయాంలోనే మొదలయ్యాయి. ఆ సంస్కరణల వల్లే దేశ ఆర్థిక వికాసం చాలా వేగాన్ని పుంజుకుంది’’ అని పేర్కొన్నారు.

ప్రపంచ మార్కెట్లు భారత్‌‌లోకి వచ్చేందుకు తలుపు తెరిచి..

‘‘1990వ దశకంలో దేశ ఆర్థిక మంత్రిగానూ భారత ఆర్థిక వ్యవస్థలో సరళీకృత విధానాలను మన్మోహన్ పరిచయం చేశారు. ప్రపంచ మార్కెట్లు భారత్‌‌లోకి వచ్చేందుకు తలుపు తెరిచారు. ఆయన ముందుచూపు, దార్శనికత అమోఘం. వాటివల్లే దేశ ఆర్థిక వ్యవస్థ నేడు బలమైన స్థితిలో ఉంది’’ అని తీర్మానంలో ప్రస్తావించారు. ‘‘ఉపాధిహామీ పథకం, విద్యాహక్కు చట్టం, జాతీయ ఆహారభద్రతా చట్టం, వ్యవసాయ రుణాల మాఫీ స్కీం, ఇండో-యూఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ వంటివన్నీ మన్మోహన్ పాలనా కాలంలోనే జరిగాయి’’ అని పేర్కొన్నారు. ‘‘దేశానికి 13వ ప్రధానిగా మన్మోహన్ సింగ్ రాజీలేని సేవలు అందించారు. 2008లో ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన సమయంలో దేశాన్ని గట్టెక్కించిన ఘనుడు ఆయనే’’ అని తీర్మానంలో తెలిపారు. సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్‌కు కాంగ్రెస్ నేతలంతా శ్రద్ధాంజలి ఘటించారు.

సోనియాగాంధీ ఏమన్నారంటే..

మన్మోహన్‌ సింగ్ మృతిపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ వేరుగా మరో సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ‘‘మన్మోహన్ సింగ్ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన నాకు స్నేహితుడు, తత్వవేత్త, మార్గ నిర్దేశకుడు. మన్మోహన్ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో గొప్ప నిబద్ధతతో వ్యవహరించేవారు. సామాజిక న్యాయం, లౌకిక వాదం, ప్రజాస్వామిక విలువలకు ఆయన అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు’’ అని సోనియాగాంధీ పేర్కొన్నారు. మన్మోహన్ లాంటి నాయకుడు దొరకడం కాంగ్రెస్ పార్టీకి గర్వకారణమని చెప్పారు. భారతావని వికాసం కోసం నాటి దేశ ప్రధానిగా మన్మోహన్ అమలుచేసిన ప్రణాళికలు, సంస్కరణలు చిరకాలం భారతీయులకు గుర్తుండిపోతాయన్నారు.

Tags:    

Similar News