Plane crash: కజకిస్థాన్ లో విమాన ప్రమాదం.. 40 మంది మృతి

కజకిస్థాన్‌ (Kazakhstan)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అక్టౌ ప్రాంత సమీపంలో అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోయింది.

Update: 2024-12-25 10:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కజకిస్థాన్‌ (Kazakhstan)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అక్టౌ ప్రాంత సమీపంలో అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. “ఎంబ్రేయర్ 190 విమానం అజర్‌బైజాన్ రాజధాని బాకు నుండి రష్యా రిపబ్లిక్ చెచెన్యా రాజధాని గ్రోజ్నీకి వెళ్తుంది. కానీ గ్రోజ్నీలో పొగమంచు వల్ల విమానాన్ని దారి మళ్లించారు. అక్టౌ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తు విమానం కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అందులో 22 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు." అని కజకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌లో తెలిపింది.

ఎయిర్ పోర్టు సమీపంలోనే..

కాగా.. ఆక్టౌ విమానాశ్రయం సమీపంలోనే విమానం కుప్పకూలిపోవడం గమనార్హం. ప్లెయిన్ క్రాష్ అయిన వెంటనే మంటలు చెలరేగాయి. అందువల్లే ప్రాణనష్టం అధికంగా జరిగిందని అధికారులు అంటుంన్నారు. అయితే, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ని అభ్యర్థిస్తూ విమానం గాల్లో చక్కెర్లు కొట్టినట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. పక్షుల గుంపుతో ఢీకొనడం, స్టీరింగ్ లోపం వల్ల విమానం కూలినట్లు చెబుతోంది. విమానం క్రాష్ అయిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News