Vasudevan: మలయాళ రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత.. కేరళలో విషాదం
ప్రముఖ మలయాళ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ (91) కన్నుమూశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ మలయాళ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ (91) కన్నుమూశారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించి బుధవారం తుది శ్వాస విడిచినట్టు సన్నిహితులు తెలిపారు. దీంతో కేరళలో విషాదచాయలు అలుముకున్నాయి. నాయర్ మృతిని కేరళ సీఎం పినరయి విజయన్ కార్యాలయం ధ్రువీకరించింది. ‘మలయాళీ భాషను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిని కోల్పోయాం. వాసుదేవన్ కేరళ నిజమైన సాంస్కృతిక చిహ్నం. లౌకికవాదం, సమానవత్వం పట్ల అతని నిబద్ధత రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చింది. ఆయన కుటుంబానికి, సాంస్కృతిక సంఘానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం విజయన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కాగా, 1933 జూలై 15న కేరళలోని మలబార్ జిల్లాలో జన్మించిన వాసుదేవన్ నాయర్ (Vasudevan nair) మలయాళ సాహిత్యంలో ఎన్నో రచనలు చేశారు. పలు చిత్రాలకు స్క్రీప్ట్ రైటర్, దర్శకుడిగానూ పని చేశారు. ఒరు వడక్కన్ వీరగాథ (1989), కడవు (1991), సదయం (1992), పరిణయం (1994) చిత్రాలకు ఉత్తమ స్క్రీన్ ప్లేగా జాతీయ చలనచిత్ర అవార్డును నాలుగు సార్లు గెలుచుకున్నాడు. ఆయన చేసిన సాహత్య సేవలకు గాను 1995లో భారతదేశ అత్యున్నత సాహిత్య గౌరవమైన జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. అంతేగాక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, వాయలార్ అవార్డు, వలథోల్ అవార్డు, లేఖాచ్చన్ అవార్డులను కూడా అందుకున్నారు. 2005లో దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ సైతం లభించింది.