Canada: కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్‌లో మార్పు.. భారతీయులపై ప్రభావం చూపే చాన్స్ !
మెరుగైన భవిష్యత్, ఉన్నత కెరీర్ కోసం అనేక మంది భారతీయ విద్యార్థులు ఉత్తర అమెరికా దేశమైన కెనడాకు వెళ్లాలనుకుంటారు.
దిశ, నేషనల్ బ్యూరో: మెరుగైన భవిష్యత్, ఉన్నత కెరీర్ కోసం అనేక మంది భారతీయ విద్యార్థులు ఉత్తర అమెరికా దేశమైన కెనడా(Canada)కు వెళ్లాలనుకుంటారు. అంతేగాక అక్కడే శాశ్వత నివాసం పొందడానికి కూడా ఆసక్తి చూపుతారు. అయితే అటువంటి వారందరికీ కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ మేరకు తమ దేశ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్(Express entry system) లో మార్పులు చేసింది. కెనడా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వచ్చే ఏడాది నుంచి కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పని విధానం ద్వారా అదనపు పాయింట్లు పొందే విధానాన్ని ఎత్తేసింది. దీంతో జాబ్ ఆఫర్ పాయింట్ల ద్వారా పర్మినెంట్ నివాసానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ రూల్స్ వర్తిస్తాయని తెలిపింది.
ఈ అంశంపై కెనడా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రేషన్ మోసాలను నియంత్రించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘తమ దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యం కలిగిన ప్రతిభను ఆకర్షిస్తూనే మోసాలను తగ్గించడానికి ఈ కీలక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మార్పు ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ సమగ్రతను బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రోగ్రామ్ అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రస్తుతం తాత్కాలికంగా పనిచేస్తున్న వారితో సహా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ఆశావాదులందరూ ప్రభావివమయ్యే చాన్స్ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇండియన్స్‌పై ప్రభావమెంత?
2023లో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్‌లో భారత్ మెరుగైన ఆధిత్యతను కొనసాగించింది. 52,106 మంది భారతీయ పౌరులు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానాలను అందుకున్నారు. ఆ సంవత్సరంలో జారీ చేసిన మొత్తంలో 47.2శాతం వాటా భారతీయులదే ఉంది. అయితే తాజాగా జాబ్-ఆఫర్ పాయింట్‌ల తొలగింపుతో శాశ్వత నివాసం కోసం కావాల్సిన 50 నుంచి 200 పాయింట్లను సాధించడం సవాల్ గా మారనుంది. కాగా, ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ అనేది కెనడియన్ ప్రభుత్వం శాశ్వత నివాసితులు కావడానికి నైపుణ్యం కలిగిన కార్మికుల నుంచి దరఖాస్తులను నిర్వహించడానికి ఉపయోగించే ఆన్‌లైన్ సిస్టమ్. ఇందులో వ్యక్తులు వారి విద్యార్హత, పని అనుభవం ప్రకారం పాయింట్లను పొందుతారు. దీని ప్రకారం కెనడాలో శాశ్వత నివాసం పొందే చాన్స్ ఉంటుంది.