Congress: వందేళ్ల తర్వాత మరోసారి సత్యాగ్రహం.. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా
రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కొత్త సత్యాగ్రహాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత స్వాతంత్ర్య పోరాటంలో 1924, డిసెంబర్ 26 ప్రాముఖ్యతను సూచిస్తూ గురువాం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో డిసెంబర్ 26న కొత్త సత్యాగ్రహాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. 1924లో కాంగ్రెస్ పార్టీ 39వ ప్లీనరీ సమావేశానికి బెలగావి ఆతిథ్యం ఇచ్చింది. మహాత్మా గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక సెషన్ ఇది. ఎంతో ముఖ్యమైనది. ఇక్కడే గాంధీజీ స్వాతంత్య్ర సాధనకు 'అహింసా, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని' బలోపేతం చేశారు. దేశ స్వాతంత్ర్య చరిత్రలో 1924 డిసెంబర్ 26వ తేదీన మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కొత్త దశను ప్రారంభించింది. ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ధనవంతులకు, పేదలకు సమాన హక్కులు కల్పించడానికి మహాత్మా గాంధీ ఈ నేల నుంచి సత్యాగ్రహం, శాసనోల్లంఘన, కొద్దిమంది చేతుల్లోనే ఆగిన సంపదకు వ్యతిరేకంగా కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. 100 ఏళ్ల తర్వాత మరోసారి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కొత్త సత్యాగ్రహం చేయనున్నాయని రణదీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీని ఈస్టిండియా కంపెనీతో పోల్చిన ఆయన, కాషాయ పార్టీ అసమానతలను కొనసాగిస్తోందని, బలహీనులను దోపిడీ చేస్తుందని, రాజ్యాంగానికి ముప్పు మారిందని ఆరోపించారు.