Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసనలు.. అధ్యక్షుడు రిజైన్ చేయాలని డిమాండ్

బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి.ఢాకాలో ఉన్న అధ్యక్ష నివాసం బంగాభబన్‌ను ఆందోళనకారులు తాజాగా ముట్టడించారు.

Update: 2024-10-23 06:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. ఆదేశ రాజధాని ఢాకాలో ఉన్న అధ్యక్ష నివాసం బంగాభబన్‌ను ఆందోళనకారులు తాజాగా ముట్టడించారు. వేలాది మంది వీధుల్లోకి చేరి నినాదాలు చేశారు. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామాతో పాటు ఐదు అంశాలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో బంగాభబన్ వద్ద పోలీసులు నిరసనకారులను అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కారులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు గాయపడ్డట్టు తెలుస్తోంది.

ప్రెసిడెంట్ షహబుద్దీన్ తన పదవికి రిజైన్ చేయాలని, 1972లో రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. అంతేగాక అవామీ లీగ్ విద్యార్థి సంస్థ బంగ్లాదేశ్ చత్రా లీగ్‌ను నిషేధించాలని తెలిపారు. అలాగే షేక్ హసీనా హయాంలో 2018, 2024లో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధమని ప్రకటించాలని, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలను అనర్హులుగా వెల్లడించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కాగా, బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇటీవల చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయగా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలోనే పాలన కొనసాగుతోంది. అయితే ఇటీవల అధ్యక్షుడు షహబుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షేక్ హసీనా రాజీనామా చేశారని మాత్రమే విన్నానని, ఆమె రాజీనామాకు సంబంధించిన ఆధారాలు తన వద్ద లేవని తెలిపారు. రాజీనామా లేఖను స్వీకరించడానికి చాలా సార్లు ప్రయత్నించానని కానీ అధి సాధ్యం కాలేదని చెప్పారు. ఈ క్రమంలోనే షహబుద్దీన్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు నిరసన చేపట్టారు. 

Tags:    

Similar News