Brics: బ్రిక్స్‌లో చేరేందుకు 30 దేశాలు సిద్ధం.. రష్యా అధ్యక్షుడు పుతిన్
బ్రిక్స్ కూటమిలో చేరుతామని 30కి పైగా దేశాలు అభ్యర్థించాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: బ్రిక్స్ కూటమిలో చేరుతామని 30కి పైగా దేశాలు అభ్యర్థించాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. రష్యాలోని కజాన్ నగరంలో జరుగుతున్న16వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ మీటింగ్‌లో కూటమి విస్తరణపై చర్చిస్తామన్నారు. బ్రిక్స్ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో గ్లోబల్ సౌత్‌ది కీలక పాత్ర ఉందన్నారు. కొత్త దేశాలను చేర్చుకోవడం ద్వారా గ్రూపు సామర్థ్యం దెబ్బతినకుండా ఉండటానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రాంతీయ ఘర్షణలను తగ్గించడానికి కూడా సదస్సులో డిస్కస్ చేస్తామని చెప్పారు. ప్రపంచం ప్రస్తుతం మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ వైపు పయనిస్తోందని నొక్కి చెప్పారు. కాగా, బ్రిక్స్ సదస్సులో భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో భేటీ అయిన మోడీ బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తోనూ భేటీ కానున్నారు.