Russia: ఉక్రెయిన్‌పై రష్యా వైమాణిక దాడి.. కీవ్, ఒడెసా నగరాలే టార్గెట్

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. కీవ్, ఒడెసా నగరాలే లక్ష్యంగా వైమాణిక దాడులకు పాల్పడింది.

Update: 2024-10-06 10:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. కీవ్, ఒడెసా నగరాలే లక్ష్యంగా ఆదివారం తెల్లవారుజామున వైమాణిక దాడులకు పాల్పడింది. సుమారు ఐదు గంటలకు పైగా క్షిపణులతో అటాక్ చేసినట్టు ఉక్రెయిన్ కైవ్ సైనిక పరిపాలన అధిపతి సెర్హి పాప్కో తెలిపారు. రష్యన్ డ్రోన్లు ఉక్రెయిన్ రాజధానిలోకి అనేక దిశల నుండి ప్రవేశించాయని వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాలపై రష్యా సుమారు 87 డ్రోన్లు ప్రయోగించగా 56 డ్రోన్లను ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసినట్లు వైమానిక దళం తెలిపింది. రెండు క్షిపణులను సైతం కూల్చివేసినట్టు వెల్లడించింది. డొనెట్స్క్ ప్రాంతంలో రష్యా బాంబర్‌ను ఉక్రేనియన్ బలగాలు నేలకూల్చినట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఘటనలో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తినష్టం వివరాలు వెల్లడించలేదు. గత 24 గంటల్లో ఈ ప్రాంతంపై రష్యా జరిపిన దాడుల్లో ఒక పౌరుడు మరణించారని, 15 మంది గాయపడ్డారని ఖెర్సన్‌లోని దక్షిణ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రోకుడిన్ వెల్లడించారు. తాజా దాడులపై రష్యా స్పందించలేదు. అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ.. అక్టోబరు 12న జర్మనీలోని రామ్‌స్టెయిన్‌లో జరిగే మిత్రదేశాల సమావేశంలో ఉక్రెయిన్ తన విజయ ప్రణాళికను ప్రదర్శిస్తుందని తెలిపారు. కాగా, 2022 ఫిబ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధంలో పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇరుపక్షాలు ఖండించినప్పటికీ వేల మంది ప్రాణాలు కోల్పోయారు.


Similar News