Middle east: భీకర యుద్ధం దిశగా పశ్చిమాసియా.. ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధం!

పశ్చిమాసియా భీకర యుద్ధం దిశగా సాగుతోంది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై, హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే.

Update: 2024-10-02 16:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియా భీకర యుద్ధం దిశగా సాగుతోంది. ఒకవైపు హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై, హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే.. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి సుమారు 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ అటాక్ చేయగా.. దీనికి సరైన సమయంలో సమాధానం చెబుతామని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఆందోళనల నేపథ్యంలోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ బుధవారం భూ దాడులకు పాల్పడింది. లెబనాన్ సరిహద్దులోకి చొరబడిన ఇజ్రాయెల్ సైనికులు రెండు కిలోమీటర్ల వరకు దూసుకెళ్లారు. ఈ ప్రాంతంలో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ సైనికులకు మధ్య తీవ్ర పోరు జరగగా ఎనిమిది మంది సైనికులు మరణించినట్టు ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. మరో 18 మంది గాయపడ్డట్టు తెలిపింది. హిజ్బుల్లా మిలిటెంట్లు పేలుడు పరికరం సహాయంతో తమ సైనికులను హతమార్చారని పేర్కొంది. హిజ్బుల్లా 3 ఇజ్రాయెల్ ట్యాంకులను కూడా ధ్వంసం చేసినట్టు తెలిపింది. అయితే రాకెట్ లాంచర్లతో సహా 150కి పైగా హిజ్బుల్లా మిలిటెంట్ల మౌలిక సదుపాయాలు వైమాణిక దాడుల్లో ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఇరాన్ దాడులపైనా ఇజ్రాయెల్ స్పందించింది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్ ఇజ్రాయెల్ వైమానిక దళ స్థావరాలను తాకాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. కొన్ని కార్యాలయ భవనాలు మాత్రం దెబ్బతిన్నాయని పేర్కొంది.

తమ పౌరులను వెనక్కి రప్పిస్తున్న దేశాలు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో లెబనాన్ నుంచి తమ పౌరులను వెనక్కి రావాలని పలు దేశాలు కోరుతున్నాయి. ఇప్పటికే చైనా 200 మందికి పైగా పౌరులను తమ దేశానికి తరలించింది. అలాగే స్పెయిన్, దక్షిణ కొరియాలు సైతం తమ పౌరులను ఖాళీ చేయనున్నట్లు ప్రకటించాయి. 350 మంది పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి స్పెయిన్ 2 సైనిక విమానాలను పంపనున్నట్టు తెలిపింది. అలాగే దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ కూడా తన సైనిక విమానాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతేగాక మిగతా దేశాలు సైతం తమ పౌరులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి.

ఇరాన్ చమురు నిల్వలే ఇజ్రాయెల్ లక్ష్యం !

ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నట్టు పలు కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు ఆదేశ చమురు నిల్వలపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి. కొద్ది రోజుల్లోనే ప్రతీకార దాడి జరిగే చాన్స్ ఉందని, దీనిపై ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ సైన్యానికి ఆదేశాలు సైతం జారీ చేసినట్టు సమాచారం. టెల్ అవీవ్‌లో దేశంలోని భద్రతా చీఫ్‌లతో సమావేశమైన నెతన్యాహు ఈ ఆర్డర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడే దాడి చేస్తే ఇరాన్ ప్రతిచర్య ఎలా ఉంటుందో కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఇజ్రాయెల్ దాడిచేస్తే ఇరాన్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగే అవకాశం ఉందని పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గాజాలో 9 మంది పాలస్తీనియన్లు మృతి

గాజాపైనా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. శరణార్థి శిబిరంపై తాజాగా వైమాణిక దాడి చేయగా 9 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ మిస్సైల్ దాడి జరిగే టైంలో ఇజ్రాయెల్‌లో ఇద్దరు ముష్కరులు కాల్పులు జరపగా.. ఆరుగురు పౌరులు మృతి చెందారు. ఈ ముష్కరులను ఐడీఎఫ్ మట్టుబెట్టింది.

నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ పలు సంస్థల చీఫ్ లను మట్టుబెట్టింది. ఇరాన్‌లోకి ప్రవేశించి హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయేను హతమార్చింది. అనంతరం లెబనాన్‌లో పక్కా ప్రణాళిక ప్రకారం వైమానిక దాడి జరిపి హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టింది. అయితే ఇరాన్‌లోనూ ఈ తరహా దాడులు జరుగబోతున్నాయని ఊహాగానాలు వెలువడటంతో తదుపరిగా ఎవరిని ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుందని ఉత్కంఠ నెలకొంది. 


Similar News