Kubra Aykut: టిక్‌టాక్ స్టార్ కుబ్రా ఐకుట్ సూసైడ్.. తీవ్ర విషాదంలో అభిమానులు

తుర్కియేకు చెందిన టిక్ టాక్ స్టార్ కుబ్రా ఐకుట్ సూసైడ్ చేసుకుంది. అపార్ట్ మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది.

Update: 2024-09-29 18:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తుర్కియేకు చెందిన టిక్ టాక్ స్టార్ కుబ్రా ఐకుట్ (26) సూసైడ్ చేసుకుంది. తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న ఓ అపార్ట్ మెంట్‌లోని ఐదో అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఈ నెల 23న ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తుర్కియే మీడియా వెల్లడించింది. ఘటనా స్థలంలో అధికారులు సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కాగా, కుబ్రా ఐకుట్ గతేడాది తనకు తానే పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. ఆమె వరుడు లేని పెళ్లి వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమె భారీగా అభిమానులను సంపాదించుకుని పాపులర్ అయింది.

అయితే కుబ్రా మరణ వార్తతో ఆమె అభిమానుల్లో విషాదం నెలకొంది. సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా కుబ్రా ఐకుట్‌కు భావోద్వేగ నివాళులు అర్పిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె చేసిన చివరి వీడియో వైరల్ అవుతోంది. ‘నేను నా శక్తిని కూడగట్టుకున్నాను. కానీ బరువు మాత్రం పెరగడం లేదు. ప్రతిరోజూ ఒక కిలోగ్రాము కోల్పోతున్నాను. నేను అత్యవసరంగా బరువు పెరగాలి’ అని తన చివరి పోస్టులో పేర్కొంది. అలాగే తన ఇంటిని శుభ్రం చేస్తూ మరో పోస్టులో కనిపించింది. కాగా, ఐకుట్ టిక్ టాక్ ఖాతాలో ఒక మిలియన్ ఫాలోవర్లు, ఇన్‌స్టాలో 2,07,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.


Similar News