ఉత్తర కొరియా చేరుకున్న పుతిన్..ఘన స్వాగతం పలికిన కిమ్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ బుధవారం తెల్లవారుజామున ఉత్తర కొరియాకు చేరుకున్నారు. ప్యాంగ్యాంగ్‌లోని విమానాశ్రయంలో దిగిన ఆయనకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఘన స్వాగతం పలికారు.

Update: 2024-06-19 03:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ బుధవారం తెల్లవారుజామున ఉత్తర కొరియాకు చేరుకున్నారు. ప్యాంగ్యాంగ్‌లోని విమానాశ్రయంలో దిగిన ఆయనకు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ ఒకే కారులో కుమ్సుసాన్ స్టేట్ గెస్ట్ హౌస్‌కి వెళ్లారు. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించడం ఇది రెండోసారి. ఈరోజు మధ్యాహ్నం కిమ్, పుతిన్‌లు సుమారు 90 నిమిషాల పాటు భేటీ కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అనేక ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేయనున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో యూఎస్ ఆంక్షలను అధిగమించడానికి రెండు దేశాలు సన్నిహితంగా సహకరించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఆయుధాల ఒప్పందం కుదిరే చాన్స్!

కిమ్, పుతిన్‌ల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రష్యాకు అవసరమైన ఆయుధాల మార్పిడికి సంబంధించి సాంకేతికత బదిలీకి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మరిన్ని ఆయుధాలు అవసరం కాబట్టి ఈ అగ్రిమెంట్‌పైనే ఫోకస్ చేయనున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరకొరియా రష్యాకు వేగంగా అర్థిక సాయం అందిస్తున్నట్టు ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 


Similar News