Joe Biden: హెజ్ బొల్లా అధినేత నస్రల్లా హత్య సరైన చర్య

ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్ బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా చనిపోయారు. కాగా.. దీనిపైనే అమెరికా అధ్యక్షుడు స్పందించారు.

Update: 2024-09-29 05:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్ బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా చనిపోయారు. కాగా.. దీనిపైనే అమెరికా అధ్యక్షుడు స్పందించారు. నస్రల్లా హత్య సరైన చర్యే అని వెల్లడించారు. గతేడాది యుద్ధం ప్రారంభమైనప్పట్నుంచే నస్రల్లా హత్యకు ఆపరేషన్ ప్రారంభమైందని బైడెన్ ప్రకటనలో తెలిపారు. హెజ్‌బొల్లా, హమాస్‌ వంటి ఇరానియన్‌ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుందన్నారు. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఉందని ఆయన మరోసారి ప్రకటించారు. నస్రల్లా ఆధ్వర్యంలో హెజ్‌బొల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతి చెందారని బైడెన్‌ తెలిపారు.

మధ్యప్రాచ్యంలో..

కాగా.. మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధప్రమాదాన్ని తగ్గించేందుకు యూఎస్ సైనిక దళాల రక్షణను మరింతగా మెరుగుపరచాలని రక్షణ కార్యదర్శిని ఆదేశించినట్లు బైడెన్ తెలిపారు. మరోవైపు బీరుట్‌లో తలెత్తిన భద్రతా పరిస్థితుల కారణంగా దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్‌ పౌరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది. బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నస్రల్లా చనిపోయినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఇదే విషయాన్ని హెజ్ బొల్లా వర్గాలు ధ్రువీకరించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా కుమార్తె ఆయన కుమార్తె జైనబ్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఇకపోతే, పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో పాటు నస్రల్లా మృతికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని హెజ్ బొల్లా వెల్లడించింది.


Similar News