Israel strikes : బీరూట్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి.. ఆరుగురు మృతి

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Update: 2024-10-03 03:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 8 మంది సైనికులు మరణించిన తర్వాత ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. గురువారం తెల్లవారుజామున లెబనాన్ రాజధాని బీరూట్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఆరుగురు లెబనీస్ పౌరులు మరణించగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ బీరూట్‌లోని బచౌరా ప్రాంతంలో పార్లమెంటుకు దగ్గరగా ఉన్న భవనాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. అలాగే దక్షిణ శివారు ప్రాంతమైన దహియాపై కూడా మూడు క్షిపణులతో దాడి చేశారని భద్రతా అధికారులు తెలిపారు. ఓ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్టు వెల్లడించారు. దీంతో గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 46 మంది మరణించారని, 85 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

నస్రల్లా అల్లుడు మృతి!

సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఒక ఫ్లాట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయగా.. హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్-ఖాసిర్ సహా నలుగురు వ్యక్తులు మరణించారని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇజ్రాయెల్, హిజ్బుల్లాలు అధికారికంగా స్పందించలేదు. అంతేగాక లెబనాన్‌లో బుధవారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ఒక అమెరికన్ పౌరుడు మరణించాడు. మృతుడిని కమెల్ అహ్మద్ జవాద్‌గా గుర్తించారు. కమెల్ మృతి పట్ల వైట్ హౌస్ అధికార ప్రతినిధి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  


Similar News