Israel strike: లెబనాన్, గాజాపై దాడులు.. ఇజ్రాయెల్ ఫ్రాన్స్ మధ్య విబేధాలు
లెబనాన్, గాజాపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ కార్యకలాపాలకు సంబంధించి ఇజ్రాయెల్, ఫ్రాన్స్ మధ్య విభేదాలు నెలకొన్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్, గాజాపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులతో విరుచుకుపడుతోంది. అయితే ఈ కార్యకలాపాలకు సంబంధించి ఇజ్రాయెల్, ఫ్రాన్స్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. లెబనాన్ సరిహద్దులోకి సైన్యాన్ని పంపి దేశంపై దాడి చేయాలన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయాన్ని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తప్పుపట్టారు. గాజాలో ఉపయోగం కోసం ఇజ్రాయెల్‌కు ఆయుధాల పంపిణీని నిలిపివేయాలని పిలుపునిచ్చారు. లెబనాన్ మరో గాజాగా మారొద్దని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. గాజాలో పోరాటానికి ఆయుధాలను పంపిణీ చేయడం మానేస్తామన్నారు. కాల్పుల విరమణ కోసం పదే పదే పిలుపునిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదని.. ఇది ముమ్మాటికీ వారి పొరపాటేనని స్పష్టం చేశారు. గాజాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ద్వేషానికి దారి తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాక్రాన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటుగా స్పందించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి నిర్ణయం సిగ్గుచేటని అభివర్ణించారు. ‘ఇరాన్ నేతృత్వంలోని అనాగరిక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నప్పుడు, నాగరిక దేశాలన్నీ ఇజ్రాయెల్ వైపు దృఢంగా నిలబడాలి. కానీ మాక్రాన్, మరికొందరు పాశ్చాత్య నాయకులు మా దేశంపై ఆయుధ నిషేధానికి పిలుపునిస్తున్నారు. ఇది వారికి ఎంతో అవమానకరం. ఇరాన్ హిజ్బుల్లాపై, హౌతీలపై, హమాస్‌పై దాని ఇతర సంస్థలపై ఆయుధ నిషేధాన్ని విధిస్తుందా’ అని ప్రశ్నించారు. శత్రువులకు వ్యతిరేకంగా తనను తాను ఇజ్రాయెల్ రక్షించుకుంటుందని చెప్పారు. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ ప్రజలను హత్య చేసిన హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో పోరాడుతున్నామని గుర్తు చేశారు. ఫ్రాన్స్ మద్దతు ఇవ్వకపోయినా యుద్ధంలో విజయం సాధిస్తామన్నారు.
మరోవైపు నెతన్యాహు ప్రకటన తర్వాత మాక్రాన్ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు ఫ్రాన్స్ మంచి మిత్రుడని తెలిపింది. ఇజ్రాయెల్ భద్రతకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తామని పేర్కొంది. ఇరాన్ లేదా ఇతర సంస్థలు ఇజ్రాయెల్‌పై దాడి చేస్తే, ఫ్రాన్స్ ఎల్లప్పుడూ ఇజ్రాయెల్‌కు అండగా ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, గత నెల 30న లెబనాన్‌లో భూసేకరణ ప్రారంభించినప్పటి నుండి 440 మంది హిజ్బుల్లా మిలిటెంట్లను చంపినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది.