గాజాలో శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 17 మంది మృతి

ఇజ్రాయెల్ దళాలు రఫా నగరంపై తమ దాడులను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో పౌరుల పరిస్థితి దారుణంగా తయారైంది.

Update: 2024-06-18 12:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ దళాలు రఫా నగరంపై తమ దాడులను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో పౌరుల పరిస్థితి దారుణంగా తయారైంది. దాడుల నుంచి కాపాడుకోవడానికి, సర్వస్వం కోల్పోయిన వారు అక్కడి శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటుండగా, వాటిని కూడా ఇజ్రాయెల్ వదిలిపెట్టడం లేదు. మంగళవారం ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లోని రెండు చారిత్రాత్మక శరణార్థి శిబిరాలపై వైమానిక దాడులు చేయడంతో 17 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఈ దాడుల్లో మరికొంత మందికి గాయాలయ్యాయి. మే నెల కంటే ముందు 10 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు ఆశ్రయం పొందిన రఫాలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ట్యాంకులు, యుద్ధ వాహనాలు తిరగడం, అలాగే భారీ బాంబు పేలుళ్ల కారణంగా అనేక విధ్వంసాలను చూస్తున్నామని అక్కడి ప్రజలు నివేదించారు.

రఫా నిరంతరం బాంబు దాడులకు గురవుతుంది. ఇలాంటి సమయంలో ప్రపంచం మొత్తం కూడా జోక్యం చేసుకోకుండా అలా చూస్తూ ఉందని, దీంతో ఇజ్రాయెల్ ఇక్కడ స్వేచ్ఛగా ఆక్రమణను కొనసాగిస్తుందని రఫా నివాసి ప్రముఖ మీడియాతో చెప్పారు. పాలస్తీనా ఆరోగ్య అధికారులు మాట్లాడుతూ, రఫా తూర్పు వైపున ఇజ్రాయెల్ కాల్పుల్లో ఒక వ్యక్తి ఉదయం మరణించాడు. గత రోజులు, వారాల్లో చాలా మంది చనిపోయారని తాము భావిస్తున్నామని, అయితే భారీ శిథిలాల కారణంగా రెస్క్యూ బృందాలు వారిని చేరుకోలేకపోయాయని వైద్యులు తెలిపారు.

ముఖ్యంగా మంగళవారం జరిగిన దాడుల్లో 1948లో జరిగిన యుద్ధంలో గాజాకు పారిపోయిన కుటుంబాలకు, వారి వారసులకు చెందిన రెండు ఇళ్లపై దాడి చేశారు. ఇవి ప్రస్తుతం శరణార్థి శిబిరాలుగా ఉన్నాయి. వీటిపై దాడులు చేయడంతో 17 మంది మరణించారు, గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు అక్కడి వైద్య బృందాలు తెలిపాయి. మరోవైపు ఇజ్రాయెల్ సైనిక అధికారులు 17 మంది మరణాలపై నేరుగా వ్యాఖ్యానించలేదు కానీ సెంట్రల్ గాజా ప్రాంతాల్లో తీవ్రవాద వర్గాలకు వ్యతిరేకంగా దళాలు దాడులు కొనసాగిస్తున్నాయని మాత్రమే అన్నారు.

Similar News