కరాచీలో సూర్యప్రతాపం.. వడదెబ్బతో 450 మంది మృతి

పాకిస్తాన్‌లో అతిపెద్ద నగరమైన కరాచీలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి

Update: 2024-06-26 13:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లో అతిపెద్ద నగరమైన కరాచీలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో వేడి గాలుల ప్రభావం తీవ్రంగా ఉండడంతో గత నాలుగు రోజులుగా ఎండ వేడికి తాళలేక కనీసం 450 మంది మరణించారని ఈధి ఫౌండేషన్ బుధవారం పేర్కొంది. ఒక్క బుధవారం మినహా గత నాలుగు రోజుల్లో కనీసం 427 మృతదేహాలను కనిపెట్టామని, మిగిలిన 23 మృతదేహాలు ఇటీవల కొత్తగా నమోదైనట్లు ఫౌండేషన్ అధికారి పేర్కొన్నారు. కరాచీలో శనివారం నుండి తీవ్రమైన వేడి వాతావరణం నెలకొంది. వరుసగా నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ పైనే నమోదవుతున్నాయి. తీర ప్రాంతాల్లో కూడా మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పాకిస్తాన్‌లో అతిపెద్ద సంక్షేమ ఫౌండేషన్ అయిన ఈధి ట్రస్ట్ పేదలకు, నిరాశ్రయులైన, అనాధ వీధి పిల్లలకు, మహిళలకు సహాయం అందిస్తుంది. దీని కింద నగరంలో నాలుగు మార్చురీలు పనిచేస్తుండగా, మృతదేహాలను ప్రస్తుతం వాటిలో ఉంచేందుకు స్థలం లేదని ఫౌండేషన్‌కు నేతృత్వం వహిస్తున్న ఫైసల్ ఈధి తెలిపారు. మంగళవారం నాడు 135 మృతదేహాలను , సోమవారం 128 మృతదేహాలను తమ మార్చురీలకు తీసుకొచ్చినట్లు ఆయన చెప్పారు. కరాచీ నగరంలో ఆఫ్ఘనిస్తాన్, కొన్ని ఆఫ్రికన్ దేశాలకు చెందిన లక్షలాది మంది వలసదారులు ఉన్నారు. వీరిలో నిరాశ్రయులుగా ఉన్న చాలా మంది మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారు.


Similar News