దిగొచ్చిన కెన్యా సర్కారు.. పన్ను పెంపు బిల్లు ఉపసంహరణ

దిశ, నేషనల్ బ్యూరో: పన్నుల పెంపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా కెన్యా ప్రజలు భగ్గుమన్నారు.

Update: 2024-06-26 16:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పన్నుల పెంపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా కెన్యా ప్రజలు భగ్గుమన్నారు. మంగళ, బుధవారాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కెన్యాలోని 47 కౌంటీలకుగానూ 35 చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. వీటిలో పాల్గొన్న దాదాపు 23 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్ గాయాలతో 30 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. మరో 200 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రజల ఆగ్రహ జ్వాలను చూసి కెనడా ప్రభుత్వం దిగి వచ్చింది.

పన్నుల పెంపు బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ప్రకటించారు. ప్రజల మనసెరిగి నడుచుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలతో చర్చించాకే ఈ బిల్లుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. నిరసనలతో కెన్యా అట్టడుకుతున్న వేళ ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు భారత సర్కారు అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కెన్యాలోని భారత కాన్సులేట్ సూచించింది. పరిస్థితి సద్దుమణిగేవరకు అనవసర రాకపోకలు చేయొద్దని కోరింది. నిరసనలు హింసాత్మకంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని కోరింది. అక్కడున్న భారత పౌరులు స్థానిక వార్తలు, ఇండియన్ మిషన్ వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అప్‌డేట్స్ ఫాలో కావాలని చెప్పింది.


Similar News