Iran-Israel War: ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు.. ఐరాస అత్యవసర భేటీ

ఇజ్రాయెల్ పై మిస్సైళ్లతో దాడి చేసి ఇరాన్ ఘోర తప్పిదం చేసిందన్నారు ప్రధాని నెతన్యాహు. ఇరాన్ ఇందుకు భారీ మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు. తమపై ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని ఇరాన్ మరోసారి హెచ్చరించింది.

Update: 2024-10-02 04:03 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడటంతో ప్రపంచం ఉలిక్కిపడింది. సుమారు 200 మిస్సైళ్లతో దాడికి పాల్పడిన ఇరాన్.. ఈరోజు ఉదయం దాడిని ఆపివేసినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ తో యుద్ధానికి తాము వ్యతిరేకమన్న విషయాన్ని నెతన్యాహుకి తెలియజేయాలని ఇరాన్ అధ్యక్షుడు మసూజ్ పెజెష్కియాన్ X వేదికగా ఆ దేశ ప్రజలను కోరారు. తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఈ దాడులు చేశామని, ఇది తమలో ఒక కోణం మాత్రమేనని చెప్పారు. ఇజ్రాయెల్ తమతో ప్రతీకారచర్యకు పాల్పడకపోతే .. దాడులు ముగిసినట్లేనని, తిరిగి దాడి చేస్తేమాత్రం దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి హెచ్చరించారు. ఇజ్రాయెల్ కు ఏ దేశం మద్దతిచ్చినా.. ఆ దేశాలపై ఇరాన్ ఆర్మీదళాల దాడులు తప్పవన్నారు.

ఇరాన్ భారీమూల్యం చెల్లించుకోవాల్సిందే..

తమ దేశంపై ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడటంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ చాలా పెద్ద పొరపాటు చేసిందని, ఇందుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోకతప్పదన్నారు. జెరూసలెంలో జరిగిన అధికారుల కేబినెట్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఇరాన్ దాడిపై తీవ్రంగా మండిపడ్డారు. తమవద్ద ఉన్న అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ తోనే ఇరాన్ మిస్సైళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలిగామని నెతన్యాహు తెలిపారు. ఇరాన్ మిస్సైళ్ల దాడి విఫలమైందని పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన అగ్రరాజ్యం అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఐరాస ఎమర్జెన్సీ భేటీ

మరోవైపు ఇరాన్ మిస్సైల్స్ దాడిపై ఐక్యరాజ్యసమితి అప్రమత్తమైంది. ఐరాస భద్రతా మండలి నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. తక్షణమే కాల్పులను విరమించాలని పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సైళ్ల దాడి, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంపై చర్చించనుంది.

ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు

ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సైళ్ల దాడిపై జో బైడెన్, కమలాహారిస్ స్పందించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించిన వారు.. అమెరికా ఇజ్రాయెల్ కు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మిస్సైళ్ల దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని అమెరికా ఆర్మీకి జో బైడెన్, కమలా హారిస్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ మిస్సైళ్లను మధ్యలోనే కూల్చేందుకు ఇజ్రాయెల్ కు సహకరించాలని ఆర్మీకి సూచించారు.

భారత్ ఎంబసీ అలర్ట్

మరోవైపు ఇరాన్ మిస్సైళ్ల దాడి నేపథ్యంలో.. ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయులకు ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. టెల్ అవీవ్ లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని భారత్ ఎంబసీ హెచ్చరించింది.

బీరుట్ కు ఇజ్రాయెల్ హెచ్చరిక

లెబనాన్ రాజధాని అయిన బీరుట్ లో ఉన్న ప్రజలను ఇజ్రాయెల్ హెచ్చరించింది. సౌత్ బీరుట్ సబర్బన్ ప్రాంతాల్లో ఉన్నవారంతా తక్షణమే ఖాళీ చేసి.. సేఫ్ ప్లేస్ లకు వెళ్లాలని సూచించింది. ఐడీఎఫ్ ఆపరేషన్ మొదలు కాబోతోందని, హెజ్బొల్లా స్థావరాలకు దూరంగా వెళ్లాలని బీరుట్ ప్రజలను హెచ్చరించింది. 


Similar News