Iran: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. 400 క్షిపణులతో అటాక్!
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. సుమారు 400 క్షిపణులతో ఇజ్రాయెల్ భూభాగంపై అటాక్ చేసింది. రాజధాని టెల్ అవీవ్ సహా ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్టు పలు కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమ పౌరులను బాంబు షెల్టర్లకు వెళ్లాలని ఆదేశించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వార్నింగ్ సైరన్లు మోగించింది. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను పాటించాలని తెలిపింది.
తమ పౌరులను రక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. ఇజ్రాయెల్ వైమాణిక వ్యవస్థ చురుకుగా ఉందని వెల్లడించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని సమయం వచ్చినప్పుడు ప్రతిస్పందిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఇరాన్ దాడిని తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్స్ వాడుతున్నట్టు సమాచారం. వీటిని ఇప్పటికే ఆక్టివేట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తుందని అమెరికా ముందే హెచ్చరించింది. దాడులకు పాల్పడితే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అయితే అమెరికా హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోలేదు. యూఎస్ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే దాడులకు తెగపడింది.
హనియే, నస్రల్లా హత్యలకు ప్రతీకారం: ఇరాన్
ఇజ్రాయెల్‌పై దాడిని ప్రారంభించిన అనంతరం ఇరాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాస్ చీఫ్ హనియే, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్యలకు ప్రతికారంగానే క్షిపణి దాడులకు పాల్పడినట్టు తెలిపింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌పై క్షిపణులను ప్రయోగించాలని ఆదేశించినట్టు సీనియర్ ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇజ్రాయెల్‌కు సాయం చేసేందుకు సిద్ధం: అమెరికా
ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇజ్రాయెల్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌లు తెలిపారు. ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను కూల్చివేయాలని తమ సైన్యాన్ని ఆదేశించాడు. తమ జాతీయ భద్రతా బృందంతో బైడెన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఇజ్రాయెల్‌లోని తమ పౌరులను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలుస్తోంది.
భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలి: ఎంబసీ సూచన
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఇజ్రాయెల్ లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి రాయబార కార్యాలయం సూచించింది. స్థానిక అధికారులు సూచించిన భద్రతా నియమాలకు అనుగుణంగా వ్యవహరించాలని తెలిపింది. దేశంలో అనవసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు దగ్గరగా ఉండాలని పేర్కొంది. భారత పౌరులందరి రక్షణకు ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది.