గాజాలో తక్షణ కాల్పుల విరమణ, బందీలను విడుదల చేయాలన్న భారత్

భారత్ తాజాగా ఐక్యరాజ్యసమితిలో హమాస్ వివాదంపై మాట్లాడింది. గాజా స్ట్రిప్‌లో తక్షణ కాల్పుల విరమణతో పాటు, ఎటువంటి షరతులు లేకుండా బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చింది.

Update: 2024-07-18 04:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ తాజాగా ఐక్యరాజ్యసమితిలో హమాస్ వివాదంపై మాట్లాడింది. గాజా స్ట్రిప్‌లో తక్షణ కాల్పుల విరమణతో పాటు, ఎటువంటి షరతులు లేకుండా బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చింది. మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సీ) బహిరంగ చర్చలో భారత డిప్యూటీ ప్రతినిధి ఆర్ రవీంద్ర దేశ వైఖరిని పునరుద్ఘాటించారు. అలాగే అనేక సంవత్సరాలు భారత్ పాలస్తీనా అభివృద్ధి కోసం వివిధ రూపాల్లో చేస్తున్న సహాయం గురించి కూడా మాట్లాడారు.

అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడులను తీవ్రంగా, నిస్సందేహంగా ఖండించిన దేశాల్లో భారత్ ఒకటి. ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో చాలా మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరు వర్గాలు కూడా సంయమనం పాటించి, చర్చలు దౌత్యం ద్వారా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఐరాసలో రాయబారి రవీంద్ర చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.

ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారతదేశం నిలుస్తుంది. శాంతియుతంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా ప్రక్క ప్రక్కన జీవించేలా రెండు వర్గాల సమస్యల పరిష్కారానికి మద్దతు ఇస్తామని రాయబారి పేర్కొన్నారు. పాలస్తీనా ప్రాంతలో అభివృద్ధి కోసం భారత్ పలు విధాలుగా సహాయం చేసింది. దాదాపు 120 మిలియన్ డాలర్లకు పైగా అందించామని రాయబారి రవీంద్ర ఐరాసలో నొక్కి చెప్పారు. ఈ సహాయం భవిష్యత్తులోను కొనసాగిస్తామని అన్నారు.


Similar News