India- China : శ్రీలంకలోని కొలొంబో సముద్ర తీరంలో ఆసక్తికర పరిణామం..పక్కపక్కనే లంగరేసిన భారత్,చైనా యుద్ధ నౌకలు..!

ఓ వైపు వాస్తవాధీన రేఖ, సరిహద్దు పొడువునా తరచూ ఉద్రిక్తతలు, మరో వైపు హిందూ మహాసముద్రంలో పట్టు కోసం ప్రయత్నాలు..

Update: 2024-08-31 20:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ వైపు వాస్తవాధీన రేఖ, సరిహద్దు పొడువునా తరచూ ఉద్రిక్తతలు, మరో వైపు హిందూ మహాసముద్రంలో పట్టు కోసం ప్రయత్నాలు.. గత కొంతకాలంగా ఇలా అనేక విషయాల్లో భారత్‌ , చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య టెన్షన్‌ కొనసాగుతున్న వేళ ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. శ్రీలంకలోని కొలొంబో సముద్ర తీరంలో రెండు దేశాల యుద్ధ నౌకలు పక్కపక్కనే లంగరేశాయి. భారత యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ ముంబయి’ సోమవారం అధికారిక పర్యటన కోసం కొలంబో తీరానికి చేరుకుంది. అదే సమయంలో చైనా కు చెందిన మూడు యుద్ధ నౌకలు ‘హీ ఫీ’, ‘వుజిషాన్‌’, ‘క్విలియాన్‌షాన్‌’ కూడా ఇదే పోర్టుకు అధికారిక పర్యటనకు వచ్చాయని శ్రీలంక నేవీ ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే మూడు రోజుల పర్యటన నిమిత్తం ‘ఐఎన్‌ఎస్‌ ముంబయి’ అనే యుద్ధ నౌక  410 మంది నేవీ సిబ్బందితో  అధికారిక పర్యటన కోసం శ్రీలంక తీరానికి వెళ్లింది. ఈ నౌకకు శ్రీలంక నేవీ ఘనమైన స్వాగతం పలికింది. శ్రీలంక నేవీతో కలిసి కలిసి ఇది పలు కార్యక్రమాల్లో పాల్గొననుంది. ‘ఐఎన్‌ఎస్‌ ముంబయి’ కొలంబో తీరంలో ఉన్న సమయంలోనే చైనా యుద్ధనౌకలు కూడా అక్కడకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘హీ ఫీ’ యుద్ధ నౌకలో 267 మంది, ‘వుజిషాన్‌’లో 872 మంది, ‘క్విలియాన్‌షాన్‌’లో 334 మంది చైనీస్‌ సిబ్బంది ఉన్నారు. ఇవి హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించినప్పటికీ నుంచి వీటి కదలికలను భారత నేవీ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూనే ఉంది. దీంతో రాబోయే రోజుల్లో అక్కడ ఏం జరగబోతుందో అని నేవీ అధికారుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.   


Similar News