JAPAN: ‘గ్రామీణ ప్రాంత యువకులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రభుత్వం బంపరాఫర్’
గ్రామీణ ప్రాంత యువకులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: జనాభా పరంగా జపాన్ అనేక రకాలైన సంక్షోభాలను ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం జపాన్ ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా వృద్ధి రేటు క్షీణిస్తున్నది. దీంతో వేగంగా తగ్గిపోతున్న జానాభా సంఖ్యను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగా తాజాగా మరో వినూత్న పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఆ దేశ రాజధాని టోక్యో నగరంలోని యువతులు పల్లెటూళ్లకు వెళ్లి అక్కడి యువకులను వివాహమాడితే ప్రోత్సాహాకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అంతే కాదు గ్రామాలకు వెళ్లి పెళ్లి సంబధాలు చూసుకునేందుకు అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించనున్నది. ఒక వేళ ఆ మహిళలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకే తమ మకాం మారిస్తే అదనంగా మరింత నగదు సాయం చేయబోతున్నది. ఈ మేరకు 2025 ఆర్థిక సంవత్సరం నుంచి పథకాన్ని ప్రారంభించాలని జపాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
విద్యా, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ఇటీవల గ్రేటర్ టోక్యో నగరానికి భారీ సంఖ్యలో వలసలు పెరిగాయి. వీరిలో యువకులతో పోలిస్తే యువతుల సంఖ్య ఎక్కువగా ఉంది. వలస వచ్చిన యువతులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లకుండా టోక్యోలోనే స్థిరపడుతున్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ-పురుష నిష్పత్తిలో గణనీయమైన తేడాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేలా మహిళలు తిరిగి గ్రామాలబాట పట్టేలా అక్కడి ప్రభుత్వం ఈ తరహా ప్రోత్సహకాలను అమలు చేయాలని చూస్తున్నది.