No Screen For kids: ఆ వయసు చిన్నారులకు రోజులో గంట మాత్రమే టీవీ, సెల్ ఫోన్.. అక్కడ కొత్త రూల్
చిన్నారుల విషయంలో ప్రభుత్వం తాజాగా సంచలన అంశాలతో కొత్త సిఫార్సులు చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: సెల్ ఫోన్లు, ఇతర డిజిటల్ గ్యాడ్జెట్ లు వచ్చాక వాటికే అతుక్కుపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. ముఖ్యంగా సెల్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్స్ మాయాజాలంలో పడి పసిపిల్లల బాల్యం మసకబారుతున్నదనే ఆందళన ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో తమ చిన్నారులకు టీవీలు లేదా డిజిటల్ స్క్రీన్ లకు దూరంగా ఉంచాలని స్వీడన్ ప్రభుత్వం అక్కడి తల్లిదండ్రులకు పలు సిఫార్సులు చేస్తోంది. డిజిటల్ తెరలు చూసే విషయంలో పలు ఆంక్షలతో కూడిన కొత్త సిఫార్సులను ఆ దేశ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ తీసుకువచ్చింది. రెండేళ్ల లోపు ఉన్న వారికి పూర్తిగా స్క్రీన్ లకు దూరంగా ఉంచాలని, 2-5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులకు రోజులో గరిష్టంగా ఒక గంట మాత్రమే స్క్రీన్ సమయానికి పరిమితం చేయాలని కొత్త సిఫార్సులో పేర్కొంది. 6-12 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులను రోజుకు గరిష్టంగా గంట నుంచి రెండు గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ లపై గడపకూడదని పేర్కొంది. ఇక 13-18 ఏళ్ల టీనేజర్స్ క రోజుకు రెండు నుంచి మూడు గంటల వరకు పరిమితం చేయాలని సూచించింది.
చాలా కాలంగా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర స్క్రీన్‌లు పిల్లల జీవితంలోని ప్రతి అంశంలోకి చొచ్చుకుపోతున్నాయని దీని వల్ల వారి ఆరోగ్యం చెడిపోవడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శారీరక శ్రమ, తగినంత నిద్రకు దూరం అవుతున్నారని ఆ దేశ హెల్త్ మినిస్టర్ జాకబ్ ఫోర్స్ మెడ్ తెలిపారు. 13-16 ఏళ్ల వయసు గల స్వీడిష్ యువకులు పాఠశాల సమయం తర్వాత సగటున రోజుకు ఆరున్నర గంటల పాటు స్కీన్ లు వాడుతున్నారని ఆయన వెల్లడించారు. 15 ఏళ్ల వయస్సులో సగం కంటే ఎక్కువ మందికి తగినంత నిద్ర లేదని స్వీడిష్ ‘నిద్ర సంక్షోభం’ గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలు పడుకునే ముందు స్క్రీన్‌లను ఉపయోగించకూడదని, రాత్రిపూట పడకగది నుండి ఫోన్‌లు, టాబ్లెట్‌లను దూరంగా ఉంచాలని ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. అతిగా స్క్రీన్‌ని ఉపయోగించడం వల్ల నిద్రలేమి, నిరాశ మరియు శరీర అసంతృప్తికి దారితీస్తుందని పరిశోధనను ఉదహరించింది. కాగా ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్లపై నిషేధం విధించాలని స్వీడన్ ప్రభుత్వం గతంలోనే చెప్పింది.