రఫాలో హమాస్‌తో పోరు ముగియబోతుంది: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

దక్షిణ గాజా నగరమైన రఫాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న భారీ పోరు దాదాపు ముగిసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు.

Update: 2024-06-24 05:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ గాజా నగరమైన రఫాలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న భారీ పోరు దాదాపు ముగిసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. హమాస్‌తో రఫాలో పోరు త్వరంలోనే ముగియబోతుందన్నారు. అంటే దీని అర్థం యుద్ధం ముగిసినట్టు కాదని, తీవ్రంగా ఉన్న పరిస్థితులు మాత్రమే కాస్త సద్దుమణుగుతాయని వెల్లడించారు. గాజాలో పోరాటం ముగిసిన తర్వాత, లెబనాన్‌లో ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లాతో పోరాడతామని, ఆ ప్రాంతంలో మరిన్ని బలగాలను మోహరిస్తామని స్పష్టం చేశారు.

గాజాలో యుద్ధానికి ముగింపు పలికే ఏ ఒప్పందానికీ తాను అంగీకరించబోనన్నారు. అందరినీ కాకపోయినా అక్కడ ఇప్పటికీ ఉన్న కొంతమంది బందీలను తిరిగి తీసుకురావడానికి వీలు కల్పించే పాక్షిక మాత్రం సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. కిడ్నాప్ చేయబడిన వారిని తిరిగి తీసుకురావడం, గాజాలో హమాస్ పాలనను నిర్మూలించడమే తమ లక్ష్యమని తెలిపారు. గాజాలో యుద్ధానంతర పరిస్థితి గురించి అడిగిన ప్రశ్నకు నెతన్యాహు స్పందిస్తూ.. సమీప కాలంలో ఇజ్రాయెల్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భవిష్యత్‌లో సైనిక నియంత్రణ ఇజ్రాయెల్ పైనే ఆధారపడి ఉంటుందని, ఈ విషయం ఇప్పటికే స్పష్టమైందని నొక్కి చెప్పారు. మరోవైపు గాజా నగరానికి సమీపంలోని శిక్షణ కళాశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయగా ఎనిమిది మంది పాలస్తీనియన్లు మరణించారు.  


Similar News