Donald Trump : ట్రంప్ ఎన్నికల ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం..స్టేజి పైకి దూసుకొచ్చిన దుండగుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) పై గత నెల 16వ తేదీన ఓ దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

Update: 2024-08-31 21:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) పై గత నెల 16వ తేదీన ఓ దుండగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.ఈ ఘటన మరవకముందే ట్రంప్ ఎన్నికల ర్యాలీలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శుక్రవారం పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ దుండగుడు మీడియా గ్యాలరీలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ట్రంప్‌ స్టేజ్‌పై మాట్లాడుతుండగా ఓ దుండగుడు వేగంగా ట్రంప్ వైపు దూసుకొచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతడిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

కాగా కొన్ని వారాల క్రితం పెన్సిల్వేనియాలోని బట్లర్‌ పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌ మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ దాడిలో ట్రంప్‌ కుడి చెవికి గాయమైంది. ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని వెంటనే సీక్రెట్‌ సర్వీస్‌ స్నైపర్‌ ఒకరు కాల్చి చంపేశారు.ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర విస్మయానికి గురి చేసింది.అయితే అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌పై ఇలా వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి.దీంతో ట్రంప్‌ భద్రతపై ఆయన మద్దతుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Similar News