Breaking: దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ షాకింగ్ నిర్ణయం..1800 మంది ఉద్యోగులు ఔట్..!

గత కొన్ని సంవత్సరాల నుండి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం.

Update: 2024-08-31 22:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని సంవత్సరాల నుండి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గతంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడమో లేక కృత్రిమ మేధ వినియోగం పెరిగిపోవడమో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి .ఆర్థిక పరిస్థితి సవాలుగా మారడంతో కాస్ట్ కటింగ్ లో భాగంగా పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి.తాజాగా ఇప్పుడు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్(Goldman Sachs) కూడా పెద్ద సంఖ్యలోనే ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. తమ వార్షిక సమీక్ష ప్రక్రియలో భాగంగా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 1300 నుండి 1,800 మంది ఉద్యోగులను గోల్డ్‌మన్ సాచ్స్ తొలగించనున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని 'వాల్ స్ట్రీట్ జర్నల్' అనే ప్రముఖ పత్రిక తెలిపింది. ఈ తొలగింపులు దాదాపు మొత్తం ఉద్యోగుల్లో 3 నుంచి 4 శాతం వరకు ఉండనున్నట్లు తెలిపింది. తొలగింపుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు వెల్లడించింది.

ఈ విషయంపై గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ప్రతినిధి టోనీ ఫ్రాట్టో మాట్లాడుతూ.. పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను గుర్తించడం, తొలగించడం సంస్థలలో సాధారణమని తెలిపారు.ఇతర ప్రధాన బ్యాంకులు కూడా ఇలాంటి పద్ధతులను అనుసరిస్తున్నాయని, పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగులను గుర్తించి, వారిని తొలగించడం ద్వారా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయని టోనీ ఫ్రాట్టోతెలిపారు. ఈ ఏడాది తొలగింపులు.. 2023తో పోలిస్తే ఎక్కువగా ఉండొచ్చని ఫ్రాట్టో పేర్కొన్నారు.అయితే ఈ కంపెనీలో జూన్ 30 వరకు చూస్తే మొత్తం 44,300 మంది ఉద్యోగులు ఉన్నారు.ఇక మరోవైపు ఈ సంస్థ యొక్క బ్యాంకింగ్ స్టాక్ ఈ వారంలోనే ఆల్ టైమ్ గరిష్ట విలువలకు చేరింది. ఆల్ టైమ్ హై వాల్యూ 517.26 డాలర్లు కాగా.. ప్రస్తుతం 510.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో U.S. బ్యాంకులు దాదాపు 5,000 ఉద్యోగులను తొలగించాయి.   


Similar News