లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ దాడి: హిజ్బొల్లా స్థావరాలే టార్గెట్

లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి వైమాణిక దాడి చేసింది. ఈశాన్య లెబనాన్‌లోని హిజ్బొల్లా మిలిటెంట్ గ్రూపునకు కంచుకోటగా ఉన్న బాల్ బెక్ నగరానికి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ దాడికి పాల్పడింది.

Update: 2024-03-24 03:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి వైమాణిక దాడి చేసింది. ఈశాన్య లెబనాన్‌లోని హిజ్బొల్లా మిలిటెంట్ గ్రూపునకు కంచుకోటగా ఉన్న బాల్ బెక్ నగరానికి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడినట్టు బాల్ బెక్ మేయర్ బచీర్ ఖోద్ర్ తెలిపారు. ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఓ పట్టణంలో ఇజ్రాయెలీ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థపై దాడి చేయడానికి పేలుడు పదార్థాలను మోసుకెళ్ళే రెండు డ్రోన్‌లను ఉపయోగించినట్టు హిజ్బుల్లా ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. గతంలోనూ లెబనాన్‌లో ఇజ్రాయెల్ అనేక దాడులకు పాల్పడింది.

మరోవైపు ఈ అటాక్‌ను ఇజ్రాయెల్ మిలిటరీ సైతం ధ్రువీకరించింది. హిజ్బొల్లా సైనిక కార్యకలాపాలకు ఉపయోగించే వర్క్ షాప్‌పై యుద్ధ విమానాలతో దాడి చేసినట్టు తెలిపింది. ఈ దాడి తర్వాత లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైపుగా 50రాకెట్లు ప్రయోగించారని పేర్కొంది. వీటిలో కొన్ని కాల్చి వేశామని, మరికొన్ని బహిరంగ ప్రదేశాల్లో పడ్డట్టు వెల్లడించింది. బాల్‌బెక్ సమీపంలో ఈ నెల 12న కూడా ఇజ్రాయెల్ వైమాణిక దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా..20మంది గాయపడ్డారు.

కాగా, గతేడాది ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. అప్పటి నుంచి అనేక దాడులు చేపట్టింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అటాక్స్‌ను ఉదృతం చేసింది. నెల రోజుల వ్యవధిలోనే బాల్ బెక్ ప్రాంతంపై మూడు సార్లు దాడి చేసింది. ఇప్పటి వరకు చేసిన దాడిలో సుమారు 100 మందికి పైగా హిజ్బొల్లా మిలిటెంట్లు, సాధారణ పౌరులు మరణించారు. 

Tags:    

Similar News