హజ్‌యాత్రలో 1301 మంది మృతి.. అధికారికంగా ప్రకటించిన సౌదీ ప్రభుత్వం

ముస్లింల పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోని హజ్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది యాత్రకు వచ్చిన సందర్శకులలో 1301 మంది మరణించినట్టు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Update: 2024-06-24 04:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ముస్లింల పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోని హజ్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఏడాది యాత్రకు వచ్చిన సందర్శకులలో 1301 మంది మరణించినట్టు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వేడిని తట్టుకోలేకనే వీరంతా ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. మరణించిన వారిలో 83శాతం మంది అనధికారికంగా యాత్రకు వచ్చినట్టు స్పష్టం చేసింది. మరో 95 మంది యాత్రికులు అనారోగ్యం కారణంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు పేర్కొంది. వారిలో కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం రాజధాని రియాద్‌కు విమానంలో తరలించినట్లు సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-జలాజెల్ తెలిపారు. చనిపోయిన అనేక మంది యాత్రికుల వద్ద ఎలాంటి పత్రాలు లేనందున గుర్తింపు ప్రక్రియ ఆలస్యమైందన్నారు. మృతులను మక్కాలో ఖననం చేశామని, ఎలాంటి విఘాతం కలగకుండా చూశామని తెలిపారు.

మృతుల్లో అత్యధికంగా 660 మంది ఈజిప్షియన్లు ఉన్నట్టు సౌదీ ప్రభుత్వం తెలిపింది. వారిలో 31 మంది మినహా అందరూ అనధికార యాత్రికులేనని పేర్కొంది. ఈ క్రమంలో అనధికారికంగా సౌదీ అరేబియాకు వెళ్లేందుకు సహకరించిన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్స్‌లను ఈజిప్ట్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది సౌదీ అరేబియాకు ఈజిప్ట్ 50,000 మందికి పైగా యాత్రికులను పంపింది. ఇక, ఇండోనేషియా పౌరులు 165, ఇండియాకు చెందిన 98 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే జోర్డాన్, ట్యునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియా నుంచి డజన్ల కొద్దీ యాత్రికులు మరణించారు. ఇద్దరు అమెరికా పౌరులు కూడా మృతి చెందినట్టు సమాచారం. 


Similar News