ప్రమాదంలో ‘రహదారుల రక్షణ’!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రమాదంలో సంభవించే మరణాలను తగ్గించేందుకు రానున్న దశాబ్దంలో ఇండియా రూ. 7.73 లక్షల కోట్లను అదనంగా రహదారి భద్రత కోసం పెట్టుబడి పెట్టాల్సిన అవసరముందని ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో స్పష్టం చేసింది. ఈ పెట్టుబడి ఏటా దేశ జీడీపీలో 3.7 శాతానికి సమానమైన ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. స్వీడెన్‌లోని స్టాక్‌హోమ్ నగరంలో జరిగిన ‘రోడ్ సేఫ్‌టీ థర్డ్ గ్లోబల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్’లో ‘డెలివరింగ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రమాదంలో సంభవించే మరణాలను తగ్గించేందుకు రానున్న దశాబ్దంలో ఇండియా రూ. 7.73 లక్షల కోట్లను అదనంగా రహదారి భద్రత కోసం పెట్టుబడి పెట్టాల్సిన అవసరముందని ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో స్పష్టం చేసింది.
ఈ పెట్టుబడి ఏటా దేశ జీడీపీలో 3.7 శాతానికి సమానమైన ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. స్వీడెన్‌లోని స్టాక్‌హోమ్ నగరంలో జరిగిన ‘రోడ్ సేఫ్‌టీ థర్డ్ గ్లోబల్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్’లో ‘డెలివరింగ్ రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా’ అనే నివేదికను విడుదల చేసింది.
నిర్దేశిత లక్ష్యాలతో, నిరంతరం రహదారి భద్రతాకార్యక్రమాలలో దీర్ఘకాలిక పెట్టుబడులు లేకపోవడం వల్ల భారతదేశ రహదారులపై అధిక మరణాల రేటు నమోదవుతోందని, వీటిని తగ్గించడానికి సంబంధిత పెట్టుబడుల ప్రాధాన్యతలను గుర్తించాలని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. ప్రతి సంవత్సరం ఇండియా రహదారులపై సుమారు 1,50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దానికి ఐదు రెట్ల మంది గాయాలపాలై క్షతగాత్రులుగా మిగిలినవారు కొందరైతే, ప్రాణాలతో కొట్టుమిట్టాడేవారు మరికొందరు ఉన్నారని నివేదిక పేర్కొంది. జాతీయ రహదారులు ప్రతిఏటా రెండు కిలోమీటర్లకు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటున్నాయి. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో కంటే పది రెట్లు ఎక్కువ. రహదారి ప్రమాదాలు ఆర్థిక వృద్ధిని కూడా ప్రభావితం చేస్తాయి. సంవత్సరానికి జీడీపీలో 3 నుంచి 5 శాతం వరకు వీటికోసమే ఆర్థికవ్యవస్థ ఖర్చు చేయాల్సి వస్తోంది.
తమిళనాడు, తిరుపూర్ జిల్లాలోని అవినాషి పట్టణానికి సమీపంలో గురువారం తెల్లవారుఝామున బస్సు, కంటైనర్ లారీని ఢీకొనడంతో 20 మంది మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో గురువారం కారు, ట్రక్కును ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఇలా దేశంలో ఏదో ఒక చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇండియాలో పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా మరణాలను తగ్గించేదిశగా మోటారు వాహనాల(సవరణ) చట్టం, 2019ని అమలు చేయాలని నివేదిక పేర్కొంది. దక్షిణాసియా దేశాలు రహదారి భద్రతలో భాగంగా ఇటీవల తమ ప్రజలను రక్షించడంలో, వారి ప్రాణాలను కాపాడటంలో, ప్రజల ప్రయాణాన్ని సురక్షితం చేయడంలో తీసుకోవాల్సిన చర్యల అవసరాన్ని గుర్తించాయి. తాము ఆయా దేశాలకు అవసరమైన ఆర్థిక తోడ్పాటుతోపాటు ఇతర సహాయసహకారాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రపంచ బ్యాంక్ అదికారి ఒకరు తెలిపారు. ఈ దిశగా ప్రాంతీయ వాణిజ్య కారిడార్లను సురక్షితం చేయడానికి దేశాలు సహకరించాలని నివేదిక సూచిస్తోంది.
నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్ దేశాల పరిధిలోని హైవేల గురించి సేకరించిన నమూనాలలో కిలోమీటరుకు 3 మరణాలు సంభవిస్తున్నట్టు వెల్లడించింది. 2016లో ఇండియా మొత్తంగా 34.5 శాతం మరణాలు జాతీయ రహదారులపైనే జరిగాయి. ఇది దేశంలో జరిగే మొత్తం రహదారి ప్రమాదాలలో 1.79 శాతం మాత్రమే అని నివేదిక తెలిపింది. రహదారి భద్రతలో భాగంగా దక్షిణాసియా అంతటా జరిగే రహదారి ప్రమాదాల డాటాను నిర్వహించేందుకు, వాటిని విశ్లేషించేందుకు వ్యవస్థలను సమయన్వయం చేయాలని, దానికి అవసరమైన ప్రాంతీయ భాగస్వామ్య చొరవకు కృషి చేయాలని నివేదిక సిఫార్సు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రమాదానికి గురయ్యే హైవే దారులను గుర్తించడానికి తమిళనాడు రాష్ట్రం ఇప్పటికే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనే కార్యాక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా వైద్య సదుపాయాలతో అనుసంధానం చేసి, అత్యవసర వైద్యసేవల స్పందన సమయాన్ని 30 నిమిషాల నుండి 11 నిమిషాలకు తగ్గిస్తుంది. ఇది ప్రపంచంలో అత్యంత మెరుగైన పనితీరుకు సమానమని ప్రపంచ బ్యాంక్ భావిస్తోంది.