దేశం కంటే 10 రెట్లు టీఎస్‌లో కరెంటు డిమాండ్ వృద్ధి..

హైదరాబాద్… దేశవ్యాప్తంగా కరెంటు వినియోగంలో గ్రోత్ పెద్దగా లేనప్పటికీ తెలంగాణ మాత్రం కరెంటు వాడకంలో దూసుకుపోతోంది. అయితే దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క తెలంగాణలో మాత్రం ఇదెలా సాధ్యమవుతోందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తెలంగాణలోనూ ఆర్థిక మాంద్యం వల్ల రెవెన్యూ పడిపోతోందని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. మాంద్యం ఉంటే కరెంటు వినియోగం తగ్గాలి లేదా వృద్ధి రేటు నెమ్మదించాలి. కానీ తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. […]

Update: 2020-02-18 08:56 GMT

హైదరాబాద్… దేశవ్యాప్తంగా కరెంటు వినియోగంలో గ్రోత్ పెద్దగా లేనప్పటికీ తెలంగాణ మాత్రం కరెంటు వాడకంలో దూసుకుపోతోంది. అయితే దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క తెలంగాణలో మాత్రం ఇదెలా సాధ్యమవుతోందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తెలంగాణలోనూ ఆర్థిక మాంద్యం వల్ల రెవెన్యూ పడిపోతోందని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. మాంద్యం ఉంటే కరెంటు వినియోగం తగ్గాలి లేదా వృద్ధి రేటు నెమ్మదించాలి. కానీ తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైంది. ఓ పక్క మాంద్యం ఉంటే కరెంటు వినియోగం గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 40 శాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది. సోమవారం (ఫిబ్రవరి 17) ఒక్కరోజే విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 12137 మెగావాట్లుగా నమోదు చేసుకుంది. గత ఏడాది ఇదే తేదీన విద్యుత్ వినియోగం 8962 మెగావాట్లతో పోలిస్తే సోమవారం వినియోగమైన విద్యుత్ 40 శాతం అధికం. దేశ వ్యాప్తంగా గనుక విద్యుత్ డిమాండ్ వృద్ధిని పరిశీలిస్తే 2020 జనవరిలో 1 లక్షా 5వేల 289 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైతే గత ఏడాది 2019 జనవరి నెలలో ఈ వినియోగం 1లక్షా1వేయి713 మెగావాట్లుగా ఉంది అంటే ఏడాది కేవలం 3.5 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. ఇది దాదాపు మాంద్యం వల్ల నెమ్మదించిన దేశ జీడీపీ వృద్ధితో సమానంగా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం 40 శాతం విద్యుత్ వినియోగ వృద్ధి నమోదవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే విద్యుత్ వినియోగంలో ఈ జెట్ స్పీడు వృద్ధికి తెలంగాణలో నెలకొన్న కొన్ని అసాధారణ పరిస్థితులు కారణంగా తెలుస్తోంది. తెలంగాణలో భారీ స్థాయిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తై గోదావరి నదిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 2 టీఎంసీలు తోడడానికి పూర్తి పంపులను ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీంతో ఉత్తర తెలంగాణలోని డిస్కం అయిన టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా సోమవారం ఒక్కరోజే 2000 మెగావాట్లు పెరిగినట్లు సమాచారం. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కదానికోసమే 1000 మెగావాట్లు అవసరమైనట్లు సమాచారం. ఇక ఈ రబీలో అత్యధికంగా రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. 24 గంటల ఉచిత విద్యుత్ కావడం, టీఎస్ఎన్ పీడీసీఎల్ పరిధిలో వ్యవసాయ బోరు కనెక్షన్లు అధికంగా ఉండడంతో రైతాంగం విద్యుత్‌ను ఈ సీజన్‌లో ఎక్కువగా వాడుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక సమ్మర్ స్టార్టై మధ్యాహ్నం పూట ఉష్టోగ్రతలు పెరగడంతో గృహ వినియోగం కూడా పెరిగినట్లు తెలుస్తోంది.

పెరిగిన విద్యుత్ వినియోగం మంచిదా..కాదా..

తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న విద్యుత్ వినియోగం మంచిదా.. కాదా… అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 80 వేల కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు నడపడానికి మళ్లీ భారీగా రోజుకు వేలల్లో మెగావాట్ల విద్యుత్‌ను అది కూడా ఎక్స్చేంజిలో స్పాట్ మార్కెట్లో కొని వాడాల్సి వస్తోంది. ఇదే కాకుండా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల రైతులు అవసరానికి మించి భూగర్భ జలాలను వాడుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇదంతా ఉచిత విద్యుత్తే కావడంతో రాష్ట్ర ప్రభుత్వమే ఈ విద్యుత్ ఖర్చును సబ్సిడీ రూపంలో డిస్కంలకు చెల్లించాలి. ఇప్పటికే అప్పుల్లో, నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలు ఈ సబ్సిడీ డబ్బులు సకాలంలో రాకపోతే మరింత అప్పులు చేసి విద్యుత్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సోమవారం ఒక్క రోజే తెలంగాణలో వాడిన 242 మిలియన్ యూనిట్ల విద్యుత్ లో కనీసం 25 శాతం అంటే 60 మిలియన్ యూనిట్లు కూడా రాష్ట్ర జెన్‌కో విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి చేసింది కాదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ కోసం ఇన్ని వేల కోట్లు అప్పులు చేసి ఖర్చు చేస్తే ఓ పక్క డిస్కంల ఆర్థిక పరిస్థితితో పాటు మరో పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దిగజారిపోయే ప్రమాదముందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.

విద్యుత్ ఛార్జీలు పెంచకతప్పదా..

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోంటే రాష్ట్రంలో ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థలైన టీఎస్ ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్‌లకు నష్టాలు కూడా పెరుగుతున్నాయి. విద్యుత్ కొనడానికి, సరఫరా చేయడానికయ్యే ఖర్చు డిస్కంలకు తిరిగి రావట్లేదు. ఇక వ్యవసాయానికయ్యే పూర్తి విద్యుత్‌ను సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ చెల్లింపులు కూడా డిస్కంలకు సకాలంలో ప్రభుత్వం చేయదు. గృహ, వ్యాపార అవసరాలకయ్యే విద్యుత్ ఖర్చును పూర్తి స్థాయిలో వినియోగదారులనుంచి రాబడితేనే డిస్కంలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ( టీఎస్ఈఆర్‌సీ)కి డిస్కంలు తమ ఆదాయ అవసరాల నివేదకను పంపాల్సి ఉంది కానీ సీఎం కేసీఆర్ ఆమోదం లేక ఛార్జీల పెంపు కోరుతూ పంపాల్సిన నివేదికను ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే 40 శాతం చొప్పున విద్యుత్ వినియోగం పెరిగి అదీ మొత్తం వ్యవసాయరంగానికి వాడితే పెద్దగా రాష్ట్ర ఆదాయం కూడా పెరిగే అవకాశం లేదని, చివరకు వినియోగదారుల మీద విద్యుత్ ఛార్జీల భారం మోపి డిస్కంలకు ఊరటనివ్వడం తప్ప వేరే మార్గం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News