గిరిజన బిడ్డపై అత్యాచారం.. హోం మంత్రిని చెప్పుతో కొట్టాలి : రేవంత్ రెడ్డి
దిశ, ఎల్బీనగర్: ఆరేళ్ల పసి బాలికను గంజాయి మత్తులో ఓ దుర్మార్గుడు ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా, పాశవికంగా మాన ప్రాణాలు తీసి, కాళ్లు చేతులు విరగొట్టి, ఒక దుప్పట్లో ముటకట్టి రక్తం ముద్ద చేసి ఐదు రోజులైనా ప్రభుత్వం తరుపున ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా రాలేదు అసలు వీళ్లు మనుషులేనా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ […]
దిశ, ఎల్బీనగర్: ఆరేళ్ల పసి బాలికను గంజాయి మత్తులో ఓ దుర్మార్గుడు ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా, పాశవికంగా మాన ప్రాణాలు తీసి, కాళ్లు చేతులు విరగొట్టి, ఒక దుప్పట్లో ముటకట్టి రక్తం ముద్ద చేసి ఐదు రోజులైనా ప్రభుత్వం తరుపున ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా రాలేదు అసలు వీళ్లు మనుషులేనా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ మల్‌రెడ్డి రాంరెడ్డితో కలిసి రేవంత్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, పిల్లల చదువుతో పాటు అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరేళ్ల చిన్నారిని గంజాయి మత్తులో ఒక నీచుడు అత్యాచారం చేసి, హత్య చేస్తే ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం లేదని, అధికారంలో ఉన్న వాళ్లు కూడా మానవ మృగాలే అని సంచలన ఆరోపణ చేశారు. మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి కూత వేటు దూరంలోనే ఉంటారని, బాధిత కుటుంబాన్ని ఓదార్చాలనే సోయి వారికి లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడికి గిరిజన కుటుంబాన్ని పరామర్శించడానికి అంటరాని తనం అడ్డోస్తుందా అని ప్రశ్నించారు.
కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి కాలనీలోనే అత్యంత దారుణ ఘటన జరిగితే కనీస స్పందన కూడా ఉండదా, బాధిత కుటుంబానికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. తీవ్ర మనస్థాపానికి గురైనట్లు ట్విట్టర్‌లో పోస్టు పెట్టిన కేటీఆర్ సాయంత్రానికి నెక్లెస్ రోడ్డులో ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లగలిగాడన్నారు. ‘‘కేంద్రం నుండి మంత్రులు వస్తే గొడుగులు పడుతున్నావు.. నీ అయ్యనేమో పంచబక్ష పరమాన్నాలు పెడుతుండు. మీకు ఈ విలాసవంతమైన జీవితం ఎవరిచ్చారు.’’ అని ప్రశ్నించారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని, పోలీసులకు చేతకాక పోతే తమకు అప్పగించాలని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు గుర్తుచేశారు. నిందితుడిని శిక్షించాలనే ఆ కుటుంబం కోరుకుంటోంది తప్పా, ప్రభుత్వం నుంచి వాళ్లు ఏమీ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఏడేళ్లలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయని, ఈ రాష్ట్రంలో మద్యాన్ని, గంజాయి, డ్రగ్స్‌ను ఆదాయ వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. ఈ ఆదాయ వనరుల ద్వారా జరుగుతున్న వికృతమైన చేష్టలను నియత్రించే పని కేసీఆర్ చేయడం లేదన్నారు. పసిబిడ్డ మరణించి ఐదురోజులైనా స్పందించని రాష్ట్ర హోం మంత్రి మహబూబ్ అలీకి సిగ్గు అనేది ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రిగా నీవు గడ్డిపీకడానికే ఉన్నవా అని ప్రశ్నించారు. మహమూద్ అలీ, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఈ నగరంలో ఉన్న మంత్రులను ఆడబిడ్డలు పొరకట్టలతో, చీపుర్లతో, చెప్పులతో, కండ్లళ్ల కారం పోసి కొట్టే రోజు వస్తుందన్నారు. మంత్రులను అలా కొడితే తప్ప మీకు సిగ్గురాదన్నారు.
రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి ఘటను పునరావృతం కాకుండా మద్యం, డ్రగ్స్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా కేటీఆర్, తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కేసీఆర్ మారాడని రాష్ట్ర ప్రజలే అంటున్నారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ఈనెల 17న అమిత్‌షా రాష్ట్రానికి వస్తున్నారని ఆయనను బీజేపీ నేతలు సింగరేణి కాలనీకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరారు. పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే సీఎం కేసీఆర్‌కు, బీజేపీకి మధ్య ఉన్న బంధంపై అనుమానించాల్సి వస్తుందన్నారు.