ఇదేమి విచిత్రమైన నిబంధన..!
ప్రభుత్వం అందించే రాయితీ పథకాలతో లబ్ధి పొందాలని నిరుపేదలు ఆశపడుతుంటారు. ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు
ప్రభుత్వం అందించే రాయితీ పథకాలతో లబ్ధి పొందాలని నిరుపేదలు ఆశపడుతుంటారు. ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుంటారు. కానీ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర విద్యాశాఖ అమలు చేస్తున్న పదో తరగతి పరీక్ష ఫీజు రాయితీ పథకం ఎస్. ఎస్.సి విద్యార్థులకు అగచాట్లను తెచ్చిపెడుతున్నది. రాష్ట్ర విద్యాశాఖ అమలు చేస్తున్న ఈ పథకం నిబంధనలు విచిత్రంగా ఉండడంతో రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది నవంబర్ 8న విడుదల చేసిన పదో తరగతి పరీక్ష ఫీజు ఉత్తర్వులు "చారాన కోడికి బారాన మసాలా" అన్న చందంగా ఉంది. విద్యాశాఖ కల్పిస్తున్న పరీక్ష ఫీజు రాయితీ పొందాలంటే రుసుం కంటే మూడు రెట్లు అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది.
అక్కరకు రాని రాయితీ...
రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల నిబంధనల ప్రకారం ఒక్కో పదో తరగతి విద్యార్థి పరీక్ష రుసుం కోసం రూ. 125 చెల్లించాలి. ఈ పరీక్ష రాయితీ పొందాలంటే విద్యార్థులు వార్షిక ఆదాయ ధ్రువపత్రం సమర్పించాల్సి ఉంటుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నివసించే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 24 వేల లోపు ఉన్నట్లు ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే మొత్తం రాయితీ వర్తిస్తుంది. పదో తరగతి పరీక్ష ఫీజులో రాయితీ పొందాలంటే ఓ విద్యార్థి మీ సేవా కేంద్రానికి వెళ్లి రూ.100 చెల్లించి ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయాలి. మరల రెండు రోజుల తర్వాత వెళ్లి ధ్రువపత్రం తీసుకొని రావడానికి రవాణా ఖర్చులు రూ.100కు పైగా అవుతాయి. ప్రభుత్వం అందించే రూ. 125 రాయితీ కోసం ఆ విద్యార్థి రూ. 200 పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
పాత నిబంధన మార్చాలి..!
పదో తరగతి పరీక్ష ఫీజు రాయితీ పథకం కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం పట్టణ ప్రాంతాల వారికి 24 వేలు గ్రామీణ ప్రాంతాల వారికి 20 వేలు మాత్రమే ఉండాలని నిబంధన ఉంది. అంటే కుటుంబ నెలసరి ఆదాయం 2వేల లోపు ఉండాలి. ఇంత తక్కువ ఆదాయం ఉండదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో భాగంగా నిరుపేదలు లబ్ధి పొందా లంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 పట్టణ ప్రాం తాల్లో రెండు లక్షల వార్షిక ఆదాయం ఉండాలని ప్రభుత్వ ఉత్తర్వులు చెబుతున్నాయి. పైగా ఇప్పుడు తహసీల్ కార్యాలయాల్లో లక్ష లోపు ఆదాయ ధ్రువ పత్రాలు ఇవ్వడం లేదు. కనీసం దీని ప్రకారం నిబంధన మార్చకపోవడంతో రాయితీ దూరం అవుతున్నది. గత రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్న ఈ పథకంలో ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తుంది. అలాగే పదో తరగతి పరీక్ష ఫీజు కూడా ప్రభుత్వమే భరిస్తే బాగుంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును మాఫీ చేయాలి.
అంకం నరేష్
63016 50324