ఎందుకని.. ఓన్లీ అదానీ టార్గెట్..?
‘సే నో టు అదానీ’ ఇలాంటివి మనదేశంలో గత దశాబ్ద కాలంగా రోజు వింటున్నాం.. కానీ అదానీ వస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని ఎక్కడో ఆఫ్రికా ఖండంలోని
‘సే నో టు అదానీ’ ఇలాంటివి మనదేశంలో గత దశాబ్ద కాలంగా రోజు వింటున్నాం.. కానీ అదానీ వస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయని ఎక్కడో ఆఫ్రికా ఖండంలోని కెన్యా యువత ఆందోళనలు చేయడమేంటి? చివరికి కోర్టుకు వెళ్లి ఏకంగా విమాన ప్రయాణాలు ఆగిపోయేంతవరకు పోరాడడం ఏంటి? శ్రీలంకలో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ‘స్టాప్ అదానీ’ అంటూ పెద్ద ఎత్తున జనం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. మయన్మార్‌లో అదానీ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆస్ట్రేలియాలో ‘గో బ్యాక్ అదానీ’ అంటూ భారీ ఆందోళనలు చేశారు. మొన్న హిండెన్ బర్గ్, నిన్న అమెరికా కోర్టు సైతం అవినీతి ఆరోపణలు చేయడంతో ప్రపంచ వ్యాపితంగా అదానీ పైననే భారీ చర్చ జరుగుతోంది. ఒక టాటా, ఒక బిర్లా, ఒక అంబానీ.. వీళ్లంతా దేశ విదేశాల్లో వ్యాపారం, ప్రాజెక్టులు నిర్మించారు. కానీ ఎవరికీ అంటని మరకలు, నిరసనలు ఒక్క అదానీకే ఎందుకు అంటుతున్నాయి ? ఆయనపై కావాలనే వ్యతిరేక ప్రచారం జరుగుతోందా?
అదానీ వ్యాపారం ఎక్కడ చేసినా లంచాలు ఇచ్చి వ్యాపారం చేస్తారని రొటీన్‌గా వినిపిస్తున్న ఆరోపణలు.. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టడానికి ముందుగా దేశవిదేశాల కంపెనీలు ఆ బిడ్డింగ్‌లో పోటీపడతాయి. కానీ అదేంటో.. ‘అదానీ వస్తున్నారంటే పోటీలో మరో కంపెనీయే ఉండనే ఉండదట. ఆ కంపెనీ ఎంతకు కోట్ చేస్తే అంతకే పనులు అప్పగిస్తారనే అపవాదు మాత్రం చాలా బలంగా ఉంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు సైతం చూపిస్తున్నారు.. కెన్యా ఎయిర్‌పోర్ట్ అగ్రి మెంట్, శ్రీలంకలోని మన్నార్‌లో 500 మెగా వాట్ల పవన విద్యుదుత్పత్తి ప్లాంట్, ఆస్ట్రేలియాలో 2017లో క్వీన్స్ ల్యాండ్‌లోని కార్మిఖేల్ కోల్ మైన్ ప్రాజెక్టు, మయ న్మార్‌లోని యాంగాన్ పోర్టులో కంటైనర్ టర్మి నల్ నిర్మాణ ప్రాజెక్టు, బంగ్లా దేశ్‌లో అదానీ పవర్ కంపెనీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీస్... ఇలా అదానీ కంపెనీ అడుగుపెట్టిన ప్రతి చోటా వివాదాలు చెలరేగి కొన్ని ఆగిపోయాయి కూడా...
వివాదాలున్నా.... విస్తరణలో టాప్!
అదానీ పై ఎన్ని విమర్శలు ఉన్నా, ఎన్ని విమర్శలు వివాదాలు ఉన్నప్పటికీ, అదానీ విస్తరణ మాత్రం ఆగడం లేదు. అదానీపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు గట్టిగానే మాట్లాడుతున్నాయి. కానీ అదానీతో ఒప్పందాలు చేసు కున్న రాష్ట్రాలు మాత్రం కాస్త భిన్నంగా మాట్లాడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అదానీ సంపాదనను తమ రాష్ట్రంలో పెట్టుబడిగా మార్చుకున్నామని, గత కేసీఆర్ ప్రభుత్వమే ఎక్కువ ఒప్పందాలు చేసుకుందని, స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల సహాయాన్ని తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. అదానీ గ్రూప్‌పై వస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా ‘డిటైల్డ్ ఇన్ఫర్మేషన్’ రావాల్సి ఉందన్నారు. అటు వైసీపీ కూడా తాము ఒప్పందం చేసుకున్నది ‘SECI’ తో తప్ప అదానీ కంపెనీతో కాదని బుకాయిస్తోంది. కేరళలో విళింజం పోర్ట్ ప్రాజెక్టుకు వచ్చిన ఏకైక బిడ్ అదానీదే. 2015లో కేరళ కేబినెట్ స్వయంగా అప్రూవ్ చేసింది కదా ... అంటే ఇంచుమించు అన్ని పార్టీలు అవసరాల రీత్యా ఆదానితో అంటకాగినవే కదా! ఎన్ని వివాదాలొచ్చినా అదానీ వ్యాపార విస్తరణ ఆగిపోలేదు. వివాదాల మధ్యే ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇన్వెస్టర్లు అదానీనే నమ్ముతున్నారు. అదే ఆయన విజయ రహస్యం కాబోలు..
అదానీ వెనుక ఎవరు...?
2014 తరువాతే అదానీ గ్రూప్ ఎదుగుదల మొదలైందని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది తప్పు. అదానీ కంపెనీ సంపద సృష్టించడం, పెంచుకోవడం కేవలం పదేళ్లలోనే జరిగింది కాదు. 2007లోనే ఫోర్బ్స్-40 లిస్ట్‌లో సంపన్న భారతీయుల జాబితాలో గౌతమ్ అదానీకి 13వ స్థానం వచ్చింది. ఇందాక చెప్పుకున్నట్టు 2011 నాటికి అతని సంపద రెట్టింపు అవడమే కాదు.. ర్యాంక్ కూడా పెరిగి 7వ స్థానానికి చేరుకున్నారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ దేశంలోనే అత్యధిక సంపద సృష్టికర్తగా 2011లో రికార్డ్ క్రియేట్ చేశారు. అదానీ కంపెనీ లాభాలు దాదాపుగా రెట్టింపు అయి ఏకంగా.. 33 వేల 211 కోట్లకు చేరింది. అప్పట్లో రాజీవ్‌గాంధీ నిర్ణయాలతోనే వ్యాపారంలో తొలి అడుగు వేశానని స్వయం గా అదానీ నుంచే స్టేట్‌మెంట్ వచ్చింది. ఇం పోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ పాలసీని ఎప్పుడైతే సరళీకరించారో.. అప్పుడే వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి తనకీ మంచి అవకాశం వచ్చిం దని గౌతమ్ అదానీ చెప్పడం మనకి తెలిసిందే! పీవీ నరసింహారావు ప్రధానిగా తీసుకున్న ఆర్థిక సంస్కరణలతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని అదానీ పలు ఇంటర్వ్యూలలో చెబుతున్నారు. ఇక్కడ ఫలానా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ వల్లే అదానీ ఎదిగారని చెప్పడం ఎంత తప్పో.. ఆ బ్యాంక్‌గ్రౌండ్ లేని వాడు ఎదుగలేరని, పడిపోతారని ఊహించుకోవడమూ అంతే తప్పు. కాకపోతే.. అదానీది ‘గుజరాత్ బేస్’ కారణంగానే ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
తొలి రోజు నుంచే అదానీ రచ్చ!
పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే ఉభయ సభల్లో గందరగోళం చెలరేగింది. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తదితరులపై అమెరికా కోర్టులో లంచాల అభియోగాలు నమోదైన వ్యవహారంపై చర్చ కోసం పార్లమెంటరీ సంయుక్త బృందం (జేపీసీ) ఏర్పాటుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యులు లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే పట్టుబట్టారు. అదానీ నిర్వా కంతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ మసకబారిందని.. అయినా ప్రధాని మోడీ ఆయనకు మద్దతిస్తున్నారని విమర్శించారు. అదానీ ముడుపుల అంశంపై చర్చకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ఇవ్వగా ఇద్దరు స్పీకర్‌లూ అనుమతి నిరాకరించడంతో ఆందోళనలు చేస్తున్నారు.
చివరికి జరిగేది..
అయితే చివరగా జరుగబోయేదేమిటంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు ఆరోపణలు సర్వసాధారణంగా చేస్తూనే ఉంటారు. అలా ఆరోపణలు చేసిన వారే తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండని గౌరవంగా ఆహ్వానిస్తుంటారు. హిండెన్‌బర్గ్-అమెరికా కేసు లాంటి సందర్భాలు వచ్చినప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటారు. కానీ ఆ తర్వాత మళ్లీ జరిగేది ఏమిటో అందరికీ తెలిసిందే కదా. అదే పునరావృతం అవుతుంది. తమ తమ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టాలంటారు, మరి కొందరు అవసరాల దృష్ట్యా విమర్శిస్తుంటారు, గట్టి చర్యలు తీసుకోవాలని పట్టుబడుతారు. సాధిస్తారు కూడా.. మనం చిన్నప్పుడు అడుకున్న సర్కస్ జెయింట్ వీల్‌లా తిరిగి తిరిగి మళ్లీ పెట్టుబడుల దగ్గరకే వచ్చి చల్లబడి పోతారు. ఇది రాజకీయ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య కాదంటారా? ఇక దీనిని బట్టి గౌతమ్ అదానీ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందో మీరే ఊహించుకోవచ్చు..
డాక్టర్. బి. కేశవులు. ఎండి. సైకియాట్రీ
చైర్మన్, అవినీతి వ్యతిరేక వేదిక
85010 61659