బోధన కత్తిమీద సాములాంటిదే!

ప్రపంచంలో ఎవరు ఏ రంగంలోనైనా, ఏ వృత్తిలోనైనా స్థిరపడి రాణిస్తూ ఘనత వహిస్తున్నా వారి బాల్య జీవితపు చాయలో ఓనమాలు దిద్దించిన ఉపాధ్యాయుడు

Update: 2024-11-27 00:45 GMT

ప్రపంచంలో ఎవరు ఏ రంగంలోనైనా, ఏ వృత్తిలోనైనా స్థిరపడి రాణిస్తూ ఘనత వహిస్తున్నా వారి బాల్య జీవితపు చాయలో ఓనమాలు దిద్దించిన ఉపాధ్యాయుడు జ్యోతి స్వరూపుడై నిలిచి ఉన్నాడనేది మరువలేని, మరాపురాని సత్యం. ఎంత ఘనులకైనా గురువులే ప్రత్యక్ష దైవాలు. సమాజాభివృద్ధికి మూల ప్రాతిపదిక అయిన విద్యావ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి ఉపాధ్యాయుడు. ఒక తరం భవిష్యత్తు పూర్తిగా అతని చేతిలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందుకే అన్ని అధికార హోదాల కంటే, అన్ని రకాల ఉద్యోగాల కంటే ఉపాధ్యాయవృత్తి మిన్నదైనదని గుర్తుంచుకోవాల్సిన విషయం.

ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం అంటే అది ఒక ఇష్టంతో, నిబద్ధతతో కూడుకొని ఉండాలే తప్ప దానిని ఒక ఉద్యోగ అవకాశంగా భావించకూడదు. సమాజం ఉపాధ్యాయుల నుండి చాలా ఆశిస్తుంది. భావితరాల వారి భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాకుండా ఆదర్శవంతమైన, చైతన్యవంతమైన విలువలతో కూడిన సంస్కారవంతమైన నవ సమాజ నిర్మాణాన్ని సమాజం ఉపాధ్యాయుల నుండి కోరుకుంటుంది. అందుకే అన్ని ఉద్యోగాల కంటే, పదవుల కంటే ఎంతో బాధ్యతాయుతంగా కొనసాగే ఉపాధ్యాయ వృత్తికి మరొకటి సాటిరాదు.

ఓర్పు నేర్పు అవసరం!

అయితే ఉపాధ్యాయ వృత్తి అందరూ అనుకునే విధంగా పైకి కనిపించేంత సులభమైనది కాదు. ఈ వృత్తి నిర్వహణ వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉంటుంది. విద్యార్థులను 21వ శతాబ్దపు నైపుణ్యాల వైపుకు నడిపించాలన్నా, వారికి క్రమ శిక్షణ నేర్పాలన్నా, విలువలతో కూడిన విద్యను అందించాలన్నా ఉపాధ్యాయునికి ఎంతో నేర్పు, ఓర్పు అవసరం. నిరంతర అధ్యయనం, అధ్యాపనం, పరిశీలన, అవగాహన, విషయ పరిజ్ఞానం, అంతర్జాతీయ దృక్పథం, వృత్తిపరంగా అభివృద్ధి చెందాలనే మనస్తత్వం, అన్నింటికీ మించి పిల్లల పట్ల వాత్సల్యం తన పనిచేసే పాఠశాల పట్ల అభిమానం మొదలైనవన్నీ ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు తన వృత్తిలో రాణించగలడు. వృత్తి గౌరవాన్ని పెంచగలడు. కడివేడు పాలలో ఒక ఉప్పురాయి వేస్తే పాలన్నీ విరిగిపోతాయి. ఉపాధ్యాయుడు పనిచేసే చోట అక్కడొకరు, ఇక్కడొకరు అన్నట్లు కొంతమంది పనిచేయని వారు, కేవలం బిల్, బెల్ కోసమే అన్నట్లుగా వ్యవహరించేవారు ఎదురుకావచ్చు. అటువంటి వారి పంచన చేరకుండా నిబద్దతతో, అంకితభావంతో పనిచేసే వారితో జతకలపడం వల్ల బంగారానికి తావి అబ్బినట్లుగా ఉంటుంది. అది వృత్తి నైపుణ్యానికి దోహదపడుతుందని నూతన ఉపాధ్యాయులు గ్రహించాలి.

పిల్లలకు విజ్ఞానాన్ని అందించడంలో..

పనిచేసే చోట, పరిసరాలలో ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసేవాళ్లు, ఉత్త మాటలతో కాలక్షేపం చేసేవారు, గ్రూపులు కట్టి రాజకీయాలు నడిపేవారు, అధికారుల మెప్పుకోసం తాపత్రయపడేవారు, ఎప్పుడు ఎదుటివారిని విమర్శించేవారు ఎందరో తారసపడతారు. నూతన ఉపాధ్యాయులు అటువంటి వారి మాయాజాలంలో చిక్కుకొనక తమ వృత్తి ధర్మానికి కట్టుబడి పని చేయాలి. నూతనంగా ఉపాధ్యాయ ఉద్యోగంలోకి ప్రవేశించిన వారి ముందు ఎన్నో సవాళ్లు నిలుస్తాయి. దశాబ్దాలుగా చదవడం, రాయడం రాని పిల్లలు, క్రమశిక్షణ లోపించిన పిల్లలు, విలువలు పాటించని పిల్లలు తారసపడతారు. తల్లిదండ్రుల నుండి వ్యతిరేకత కూడా ఎదురుకావచ్చు. ఈ పరిస్థితుల నడుమ పనిచేయడం కత్తిమీద సాములాంటిది. సాధారణంగా ఒక వృత్తిలోకి ప్రవేశించినపుడు పరిస్థితుల పట్ల అప్రమత్తత అవసరం. ఒక వృత్తిలో నూటికి నూరు శాతం ఎవరు న్యాయం చేయలేరు. కానీ విద్యార్థుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వారికి విజ్ఞానాన్ని అందించడంలో గురువుపాత్ర అనిర్వచనీయం. సమయపాలన, ఖచ్చితత్వం, పెద్దల పట్ల వినయ విధేయతలు, సంస్కారం విషయ పరిజ్ఞానంతో పాటు వేషధారణ తదితర విషయాల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్ మోడల్‌గా ఉండాలి.

ఏవైనా సమస్యలుంటే..

ఈనాడు కొన్ని సామాజిక మాధ్యమాలలో వార్తా పత్రికల్లో ఉపాధ్యాయుని, వేషభాషలు ప్రవర్తన విలువల గురించి అనేక రకాలుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల కొంతమంది విలువలు క్షీణించిన ఉపాధ్యాయుల ప్రవర్తన కారణంగా ఉపాధ్యాయ లోకం అవమానాలు ఎదుర్కొంటున్నాయి నీతి, నిజాయితీ, క్రమశిక్షణ నైతికత, చిత్తశుద్ధితో ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని పాటించినప్పుడే ఉపాధ్యాయ వృత్తి విలువ పెరుగుతుందని గ్రహించాలి. అలాగే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి పాలనాపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి, ఉపా ధ్యాయ హక్కుల పరిరక్షణకు, విద్యారంగ సంక్షే మం కొరకు ఎన్నో యూనియన్లు కృషి చేస్తు న్నాయి. ఏమైనా ఇబ్బందులుంటే వాటి ద్వారా పరిష్కరించుకోవచ్చు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. ఆ దిశగా నూతన ఉపాధ్యాయులు అడుగులేస్తారని ఆశిద్దాం.

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Tags:    

Similar News