తోగ్గూడెంలో మళ్లీ మైనింగ్ షురూ.. రాజకీయ అండతో చెలరేగుతున్న అక్రమార్కులు

మైనింగ్ నిర్వహణ అంతా అక్రమమని, నిబంధనలకు వ్యతిరేకంగా తోగ్గూడెం క్వారీలో పనులు జరుగుతున్నాయని ప్రజా సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదు.

Update: 2024-11-27 02:15 GMT

దిశ బ్యూరో, ఖమ్మం: మైనింగ్ నిర్వహణ అంతా అక్రమమని, నిబంధనలకు వ్యతిరేకంగా తోగ్గూడెం క్వారీలో పనులు జరుగుతున్నాయని ప్రజా సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదు. ‘దిశ’లో వరుస కథనాల నేపథ్యంలో రాజకీయ నాయకులను ఆశ్రయించిన క్వారీ నిర్వాహకుడు.. వారిచ్చిన హామీతో మళ్లీ మైనింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం. అధికారులు సైతం తూతూమంత్రంగా కందకాలు తవ్వించినా.. అర్ధరాత్రి మళ్లీ కంకర రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. అంతేకాదు.. ‘దిశ’పై అక్కసు పెంచుకున్న క్వారీ నిర్వాహకుడు సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలు పెట్టాడు. అయితే.. క్వారీ నిర్వాహకుడిని వెనుకేసుకొస్తూ అతనికి సలహాలు, సూచనలు ఇస్తున్నది ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకునిగా తెలుస్తున్నది. అక్రమార్కునికి పార్టీ నాయకులు కొమ్ముకాయడం విడ్డూరంగా ఉంది.

కందకాలు ఎందుకు తవ్వినట్లు..

‘దిశ’లో వచ్చిన అక్షర సత్యాలను ఆఫ్ ది రికార్డ్‌గా చెప్పిన అధికారులు.. మూడు నాలుగు రోజుల తర్వాత లారీలు వెళ్లకుండా వచ్చి, పోయే మార్గాల వెంట కందకాలు తవ్వారు. మైనింగ్, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొని క్వారీ నిర్వాహకునికి కూడా సమాచారం అందించారు. దాని ప్రకారం మైనింగ్ నిర్వాహకులు మైనింగ్ నిర్వహించకూడదు. లారీల్లో కంకర కూడా తరలించకూడదు. అయితే.. ఈ విషయంలో అధికారులు సైతం చాలా తెలివిగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారీల వద్ద మాత్రమే కందకాలు తవ్విన వీరు.. క్రషర్ మిల్లుల వద్ద దారులు అలాగే వదిలిపెట్టారు. దీంతో క్రషర్ మిల్లుల వద్ద కొట్టిన కంకరను అర్ధరాత్రుల్లో తిరిగి రవాణా చేస్తున్నారు. అధికారులు క్వారీ వద్ద కందకాలు ఎందుకు తవ్వారో.. మైనింగ్ ప్రాంతంలో ఎందుకు వదిలారో వారికే తెలియాలి.

రాజకీయ నాయకుడి అండాదండ..

మైనింగ్ నిర్వాహకుని భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు పూర్తి సహాయ సహాకారాలు అందిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఆ నాయకుడిని కలిసిన తర్వాతే నిర్వాహకుడు యథేచ్ఛగా కంకర రవాణా చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు సదరు నాయకుడు అధికారులతో మాట్లాడి చూసీచూడనట్లు వ్యవహరించాలని చెప్పినట్లు టాక్. దీంతో తిరిగి ధైర్యం పుంజుకున్న క్వారీ నిర్వాహకుడు రెండు రోజులుగా అర్ధరాత్రిళ్లు రవాణా ప్రారంభించినట్లు స్థానికులు చెబుతున్నారు. బ్లాస్టింగ్స్ వల్ల తమ ప్రాణాలు పోతున్నా.. గాలి కలుషితం అయి ఇబ్బందులు పడుతున్నా.. ఇళ్లు బీటలు వారుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్వారీ నిర్వాహకుడు అందజేసే ముడుపులకు ఆశపడి అధికారులు, నాయకులు ఇలాంటి అక్రమార్కులను ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమంగా మారుస్తామని హెచ్చరిస్తున్నారు.

పోలీసులపై నాయకుని ఒత్తిడి..

నియోజకవర్గం మొత్తం తన కనుసన్నల్లో నడిపిస్తున్న నాయకుడు సెటిల్‌మెంట్ల విషయంలోనూ అందెవేసిన చేయిగా ప్రచారం జరుగుతున్నది. నియోజకవర్గంలోని వివిధ స్టేషన్లకు వచ్చే సివిల్ కేసులు కూడా అతనికి తెలియకుండా జరగవు అంటే అతిశయోక్తి కాదు. స్టేషన్లకు వచ్చే సివిల్ కేసుల పరిష్కారం కోసం సదరు నాయకుడి దగ్గరకు తీసుకు వెళ్లడం.. ఆ నాయకుడే సెటిల్ చేయడం గమనార్హం. ఎవరైనా ఎదురు తిరిగి తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తే.. తిరిగి స్టేషన్‌కు వెళ్లమని, అక్కడే చూసుకోండంటూ సెలవిస్తాడు. పోలీసులకు ముందే ఆదేశాలుండటంతో తీరా అక్కడికి వెళ్లినా న్యాయం దక్కకపోవడం.. చివరకు తిరిగి, వేసారి ఆ నాయకుడు చెప్పిందే వినడం గమనార్హం. పోలీసు అధికారులు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వంతపాడటం పరిపాటిగా మారింది.

‘దిశ’పై క్వారీ నిర్వాహకుని అక్కసు..

‘దిశ’లో వరుస కథనాల నేపథ్యంలో తోగ్గూడెం క్వారీపై వివిధ దినపత్రికల్లో, చానళ్లలో అనేక కథనాలు వచ్చాయి. దీంతో జిల్లా, రాష్ట్రస్థాయిలో తోగ్గూడెం క్వారీపై చర్చ సాగింది. దాంతో నిర్వాహకుడు ‘దిశ’ దినపత్రికను టార్గెట్ చేశాడు. కథనాలు రావడమే ఆలస్యం.. స్థానిక నాయకుని దగ్గరకు పరుగులు పెట్టి అతని డైరెక్షన్‌లో సోషల్ మీడియాలో ‘దిశ’ విలేకరులపై దుష్ప్రచారం సాగించాడు. కథనం వచ్చిన తొలిరోజే క్వారీ నిర్వాహకుడు స్థానిక విలేకరికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘సంవత్సరం మొత్తం రాసుకున్నా.. ఎవరూ ఏమీ పీకలేరని, ప్రతినెలా అధికారులకు మామూళ్లు పడేస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా రాజకీయ నాయకులు కూడా ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశాడు. క్వారీలోకి అడుగుపెట్టాలంటే విలేకరులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే క్వారీలో బొంద పెడతామని హెచ్చరించాడు. తాజాగా తోగ్గూడెం స్థానికుడు ఒకరు క్వారీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అతడిని తీవ్ర బెదిరింపులకు గురిచేశాడు. ఇంటికి వెళ్లి యువకుని తండ్రిపై ఫైర్ అయ్యాడు. ‘నీ కొడుకు ఇట్లాగే చేస్తే లారీతో గుద్దించి చంపుతా. నాకు రెండు నిమిషాల పని’ అని హెచ్చరించాడు. జరిగిన విషయాన్ని గ్రామస్తుడు ‘దిశ’కు తెలిపి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తంచేశాడు. త్వరలోనే ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాడు.

Tags:    

Similar News