గ్రేటర్‌పై సీఎం స్పెషల్ ఫోకస్.. తొలి ఏడాదిలోనే భారీ ప్రాజెక్టులు
తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి వినూత్న పంథాను అనుసరించింది.
దిశ, సిటీబ్యూరో: తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి వినూత్న పంథాను అనుసరించింది. గ్రేట్ ప్లాన్, గ్రేటర్ విజన్‌తో సిటీలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎలివేటేడ్ కారిడార్లు, మెట్రో, రోడ్లు, రవాణా సదుపాయాల విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా 2050 మాస్టర్ ప్లాన్‌తో గ్రేటర్ సిటీ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించారు.
రూ.2,232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్..
సికింద్రాబాద్‌లోని అల్వాల్ సమీపంలో రాజీవ్ రహదారిపై రూ.2,232 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నాగ్‌పూర్ జాతీయ రహదారిపై రూ.1,580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. వీటితో సిటీలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించేందుకు అవకాశముంది. ఈ కారిడార్ల నిర్మాణానికి, మొహిదీపట్నం స్కైవాక్ నిర్మాణాలకు ప్రధాన అడ్డంకిగా ఉన్న రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు సీఎం పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. గడిచిన పదేండ్లలో పెండింగ్‌లో ఉన్న ఈ భూముల స్వాధీన ప్రక్రియను కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే సాధించగలిగింది. మీర్‌అలం చెరువు సమీపంలో దాదాపు రూ.360 కోట్ల అంచనా వ్యయంతో 4-లేన్ వంతెన నిర్మాణం చేపడుతోంది. ఎల్బీ నగర్ సమీపంలో బైరామాల్ గూడ ఫ్లైఓవర్‌ను ప్రారంభించింది. ఆరంఘర్ నుంచి జూ పార్క్ వరకు ఫ్లైఓవర్‌ను త్వరలోనే ప్రారంభించనుంది.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా..
హైదరాబాద్‌లోని చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. నగరంలోని జంట జలాశయాలను పునరుద్ధరించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. మూసీలోకి చేరుతున్న మురికి నీటిని శుద్ధి చేసేందుకు 39 ఎస్టీపీలను ఏర్పాటు చేస్తోంది. ఎల్లంపల్లి నుంచి మరో 20 టీఎంసీల గోదావరి నీళ్లను హైదరాబాద్‌లో తాగునీటికి, మూసీలో స్వచ్ఛమైన నీటి ప్రవాహానికి వీలుగా బహుళ ప్రయోజనాలుండే ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా బాపూఘాట్‌ను దేశంలో ఎక్కడా లేని విధంగా తీర్చిదిద్దే ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ సెంటర్‌ను ఇక్కడ నెలకొల్పనుంది.
రూ.24,269 కోట్లతో మెట్రో రెండో దశ..
రూ.24,269 కోట్లతో మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 69 కిలో మీటర్లకు అదనంగా ఫేజ్ 2లో పాతబస్తీ చుట్టుముట్టేలా ఎయిర్‌పోర్టు వరకు 76.4 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపట్టనుంది. నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గ్ నుంచి కోకాపేట్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు రెండో దశలో విస్తరించడానికి డీపీఆర్‌లను సిద్దం చేయడంతోపాటు కేంద్రప్రభుత్వానికి సైతం పంపించారు.
హెచ్-సిటీలో రహదారులు..
హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్ట్‌లో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో రహదారుల నిర్మాణానికి దాదాపు రూ.8,996 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసింది. రూ.596.2 కోట్ల అంచనాలతో వరద నీటి కాలువల నిర్మాణం చేపట్టింది. ప్రధాన జంక్షన్లన్నింటా వాటర్ ఇన్ టేక్ వెల్స్ తవ్వించి.. అక్కడి నుంచి నీటిని డ్రైనేజీలకు, నాలాలకు తరలించే ప్రాజెక్టును చేపట్టారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని అధిగమించేలా రూ.826 కోట్ల అంచనాలతో 6 జంక్షన్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్, కేబీఆర్ ఎంట్రెన్స్ జంక్షన్, రోడ్ నెంబర్-45 జంక్షన్, ఫిల్మ్‌నగర్, మహారాజా అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనుంది.
రూ.18వేల కోట్లతో త్రిపుల్ఆర్..
హైదరాబాద్ నగర విస్తరణ, అభివృద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం) నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి నుంచి ప్రారంభమై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్పల్లి మీదుగా ఆమనగల్లు, కందుకూరు, ఇబ్రహీంపట్నం నుంచి నల్గొండ జిల్లా చౌటుప్పల్ వరకు దాదాపు 189 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మించనున్నారు.
30 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ..
హైదరాబాద్‌లో దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పుతుంది. ఫార్మా సిటీతో పాటు ఏఐ సిటీ, సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ టెక్నాలజీ పరిశ్రమల పవర్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
హైకోర్టుకు 100 ఎకరాలు..
హైకోర్టు నూతన భవనానికి బుద్వేల్‌లో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. వీటితో పాటు ఉస్మానియా కొత్త ఆస్పత్రి భవనాన్ని గోషామహల్ సమీపంలో నిర్మించేందుకు స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్ సిటీలో రవాణా సేవలను విస్తరించేందుకు కొత్తగా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయటంతో పాటు మహాలక్ష్మి ద్వారా సిటీ బస్సుల్లో దాదాపు 50 లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది.