‘పచ్చి’ దగా..! కాంటాల పేరుతో రైతులను దోచేస్తున్న దళారులు

పచ్చి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం మండలంలో విచ్చలవిడిగా సాగుతోంది.

Update: 2024-11-27 02:15 GMT

దిశ, మంగపేట: పచ్చి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం మండలంలో విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు దళారులు(వ్యాపారులు) ఖరీఫ్ సాగు సమయంలో రైతులకు ముందస్తుగా అప్పులు ఇచ్చి వాటిని వడ్డీతో రాబట్టుకునేందుకు పచ్చి ధాన్యం కొనుగోళ్లకు తెర లేపారు. సాధారణంగా రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి 17 శాతం నుంచి 19 శాతం మాయిశ్చర్ (తేమ) వచ్చే వరకూ ఎండబెట్టి కాంటాలు వేయడంతో రైతులకు ఏ-గ్రేడ్ (సన్న) ధాన్యానికి రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుంది. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నేటికీ కాంటాలు ఆలస్యం కావడంతో రైతులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక విధి లేని పరిస్థితుల్లో అప్పులిచ్చిన దళారులకే తమ పంటను అమ్ముకుంటున్నారు. అప్పుల రికవరీ ధ్యేయంగా దళారులు రైతులు కోత కోసిన వెంటనే ఆరబెట్టని పచ్చి ధాన్యం కొనుగోలు చేస్తూ.. వారికి క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,800 చెల్లిస్తున్నారు. మండలంలోని కమలాపురం, మల్లూరు, కొత్తమల్లూరు, చుంచుపల్లి, రమణక్కపేట, రాజుపేట, అకినేపల్లి మల్లారం పంచాయతీల్లో అధికంగా పచ్చిధాన్యం కాంటాలు జరుగుతుండగా.. నర్సింహ సాగర్, బుచ్చంపేట, కోమటిపల్లి, నర్సాపురం బోరు పంచాయతీల్లో పాక్షికంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.

రైతులు అప్పులే ఆసరాగా దోపిడీ..

ఖరీఫ్ వరి సీజన్‌లో రైతులు తమ పంటల సాగుకు దళారుల నుంచి తీసుకున్న ముందస్తు అప్పులే ఆసరాగా చేసుకుని ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తుంది. మండలంలో గడచిన మూడేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందా ప్రస్తుతం బహిరంగంగా రైతుల పంట పొలాల్లోనే కాంటాలు వేసే స్థాయికి వచ్చిందంటే దళారుల ఆగడాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. రైతుల ధాన్యాన్ని తూకం రాళ్లు వేయకుండా ‘పడికట్టు’ పేరుతో క్వింటాకు 2 నుంచి 3 కిలోల ధాన్యం దోపిడీకి గురిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రైతుల దోపిడీని అరికట్టాల్సిన తూనికలు కొలతలు, వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాలశాఖల విజిలెన్స్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దళారులు ఇచ్చే సీజనల్ మామూళ్లకు ఆశపడి వారి దోపిడీకి సహకరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొనుగోళ్లలో కొత్త ఎత్తుగడలు..

పచ్చిధాన్యం కొంటున్న దళారులు రైతులను దోచుకునేందుకు కొత్త ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు తప్పడు సమాచారం ఇస్తూ వారిని నిలువునా దోచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు త్వరగా కావని, ధాన్యం ఆరబెట్టి 19 శాతం నుంచి 21 శాతం వరకు మాయిశ్చర్ ఉంటేనే కొంటారని, అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసి నష్టపోతారని, పరదాలు అందుబాటులో లేకపోతే పూర్తిగా నష్టపోతారని, ధాన్యం కాంటా వేసినా నెల రోజుల వరకు డబ్బు రాదని చెప్పి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ మాటలు నమ్మి రైతులు కోసిన ధాన్యం కోసినట్లు ప్రభుత్వ మద్దతు ధరకంటే తక్కువగా అమ్మి దళారుల అప్పులు కట్టేస్తున్నారు.

అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు దాటుతున్న ధాన్యం..

దళారులు కొంటున్న ధాన్యం అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు దాటుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. చెక్‌పోస్టు సిబ్బందిని మచ్చిక చేసుకుని ఒక్కో లారీకి రూ.వెయ్యి నుంచి రూ.2వేలు అప్పగిస్తూ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాల వేగం పెంచి మిల్లులకు తరలించి రైతులకు వెంటనే డబ్బులిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే మధ్య దళారుల దందాకు రైతులు బలి కావల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులు మండలంలో పర్యటించి పచ్చి మోసానికి కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Similar News