ఇల్లు గెలిచి రచ్చ గెలవమన్న మాటను మరిచిన సీఎం జగన్.. నలుగురిలో అభాసుపాలు
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలతోపాటుగా అసెంబ్లీ ఎన్నికలు కూడ జరగనున్న విషయం తెలిసిందే.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలతోపాటుగా అసెంబ్లీ ఎన్నికలు కూడ జరగనున్న విషయం తెలిసిందే. అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని రాజకీయవిశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదనే విషయం సీఎం జగన్‌కు సైతం అర్థమైనట్టు ఉంది, అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని కుటుంబ సబ్యులతోపాటు ప్రతిపక్షల నేతలు ఎద్దేవ చేస్తున్నారు.
అది చాలదు అన్నట్టుగా పొరుగు రాష్ట్ర నేతలను గెలికిమరీ పరువు పోగొట్టుకుంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరోదారి అన్నట్టుగా ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి అని విశ్లేషకులు అంటున్నారు.
రాజకీయ విమర్శలకు బదులు వ్యక్తిగత విమర్శలు చేస్తూ వివాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అనాలోచితంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు అనే విచక్షణ లేకుండా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి నలుగురిలో అభాసుపాలయ్యారు.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనుచిత వ్యాఖ్యలు..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఏపీలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పోటి చేసేలా చంద్రబాబు కుట్ర చేశారని జగన్ అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషేనని, ఓట్లను చీల్చి, వైసీపీని ఓడించి చంద్రబాబును గెలిపించడానికి కుట్రలు పన్నుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.
జగన్ అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. జగన్ మాట్లాడే మాటలను సొంత చెల్లి, కన్నతల్లే నమ్మడం లేదు, అలాంటి వ్యక్తి మాటలకు విలువ లేదని ఎద్దేవ చేశారు. జగన్ చిన్నాన్నకు ఏం జరిగిందో కుటుంబ సభ్యులే బహిరంగంగా చెబుతున్నారని, ముందు తల్లి, చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని, అలానే జగన్ తన కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
వ్యక్తిగత సంబంధాలకు రాజకీయాలకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు పట్ల తనకు గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సహకరిస్తానని స్పష్టం చేశారు.
జగన్ అన్నకు మతిస్థిమితం లేదన్న వైఎస్ షర్మిల..
తన అన్న జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టిందని, అందుకే ఏది జరిగినా దానికి చంద్రబాబు కారణం అని అంటున్నారని ఎద్దేవ చేశారు. లేకపోతే ఓ ప్రతిపక్ష నేత మరో రాష్ట్ర సీఎంని కంట్రోల్ చేయగలరా? అలా అయితే జగన్‌కు కూడా సీఎం కదా మరి ఆయన్ని కూడా ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. తనని, మరో రాష్ట్ర సీఎంని, ప్రధాని మోడీని కూడ చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నారని జగన్ అంటున్నారు, చంద్రబాబుకు నిజంగా అంత పవర్ ఉంటే ఎందుకు జైలుకు వెళ్తారు అని మండిపడ్డారు.
వైఎస్ జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీమ చిట్టుక్కుమన్న చంద్రబాబు కారణం అంటున్న జగన్‌కు అద్దం పంపిస్తున్నా, ఆ అద్దంలో ముఖం చూసుకుంటే మీకు మీరు కనిపిస్తున్నారో లేక చంద్రబాబు ముఖం కనిపిస్తుందో టెస్ట్ చేసుకోవాలని సూచించారు. పదేపదే చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ, తనను విమర్శిస్తున్న జగన్ మానసిక స్థితిపై భయమేస్తుందని పేర్కొన్నారు.
Read More..