Pegasus : ‘పెగాసస్’పై సుప్రీంకోర్టులో మరింత విచారించాలి : కాంగ్రెస్
దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెలీ కంపెనీ ‘ఎన్ఎస్‌ఓ గ్రూప్’ వాట్సాప్ సర్వర్లలోకి పెగాసస్(Pegasus) స్పైవేర్‌ను ప్రవేశపెట్టి వాట్సాప్ యూజర్లపై నిఘా పెట్టిందని ఇటీవలే అమెరికా(US) కోర్టు ధ్రువీకరించింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెలీ కంపెనీ ‘ఎన్ఎస్‌ఓ గ్రూప్’ వాట్సాప్ సర్వర్లలోకి పెగాసస్(Pegasus) స్పైవేర్‌ను ప్రవేశపెట్టి వాట్సాప్ యూజర్లపై నిఘా పెట్టిందని ఇటీవలే అమెరికా(US) కోర్టు ధ్రువీకరించింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా(Randeep Surjewala) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, జర్నలిజం, వ్యాపార రంగాలకు చెందిన దాదాపు 300 మందికిపైగా భారతీయ ప్రముఖుల వాట్సాప్ నంబర్లపైనా పెగాసస్ నిఘా పెట్టిందని అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చాయన్నారు. ఈనేపథ్యంలో అమెరికా కోర్టు ధ్రువీకరించిన అంశాల ప్రాతిపదికన భారత సుప్రీంకోర్టు కూడా విచారణ నిర్వహిస్తే బాగుంటుందన్నారు. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా రణదీప్ సూర్జేవాలా ఒక పోస్ట్ చేశారు. ‘‘వాట్సాప్‌పై పెగాసస్ స్పైవేర్‌తో నిఘా అంశంపై భారత సర్కారు ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ 2021-22లో సుప్రీంకోర్టు(Supreme Court)కు నివేదికను సమర్పించింది. ఆ నివేదికను ఇకనైనా సుప్రీంకోర్టు ప్రజల కోసం విడుదల చేస్తుందా ?’’ అని ఆయన ప్రశ్నించారు.
‘‘భారత్‌లో పెగాసస్ స్పైవేర్ బారినపడిన 300 వాట్సాప్ నంబర్ల వివరాలను సమర్పించాలని ఇకనైనా మెటా కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశిస్తుందా ?’’ అని రణదీప్ అడిగారు. పెగాసస్ నిఘా పెట్టిన భారత్‌లోని ఆ 300 వాట్సాప్ నంబర్లు ఎవరివి అనేది చెప్పాల్సిన బాధ్యత మోడీ సర్కారుపై ఉందన్నారు. మెటా కంపెనీ స్వచ్ఛందంగా ఈ సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘పెగాసస్ బాధితులుగా మారిన ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు ఎవరు ? ఆ ముగ్గురు విపక్ష నేతలు ఎవరు ? ఆ రాజ్యాంగ అథారిటీ ఎవరు ? ఆ జర్నలిస్టులు ఎవరు ? ఆ పారిశ్రామికవేత్తలు ఎవరు ? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, దాని దర్యాప్తు సంస్థలకు పెగాసస్ నుంచి అందిన సమాచారం ఏమిటి ? ఆ సమాచారాన్ని ఎలా వాడారు ? దుర్వినియోగం చేశారా.. ఎలాంటి పరిణామాలు సంభవించాయి ?’’ అని రణదీప్ సూర్జేవాలా ప్రశ్నలు సంధించారు. భారత్‌లో పెగాసస్ వ్యవహారంతో సంబంధమున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.