Champions Trophy : చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్‌లు అక్కడే.. వేదిక ఖరారు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. టోర్నీని హైబ్రిడ్ మోడల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తటస్థ వేదికగా దుబాయ్‌ను ఎంపిక చేసినట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. తటస్థ వేదిక కోసం దుబాయ్‌తోపాటు కొలంబోను పీసీబీ పరిశీలించింది. కానీ, చివరికి దుబాయ్‌నే ఖరారు చేసింది. ‘పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) హెడ్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అలీ నహ్యాన్‌తో ఆదివారం భేటి అయ్యారు. తటస్థ వేదికపై ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేశాం.’అని పీసీబీ అధికార ప్రతినిధి అమీర్ మిర్ తెలిపారు. టోర్నీలో టీమిండియా మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఒకవేళ భారత్ సెమీస్, ఫైనల్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరుగుతాయి. చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా రిలీజ్ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో టోర్నీ జరగనుంది.