ఆ ముగ్గురూ దత్తపుత్రులే!
దిశ, కరీంనగర్: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆ ముగ్గురికి ఓ ప్రత్యేకత ఉంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సన్నిహితులుగా, నెహ్రూ కుటుంబానికి హితులుగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆ నాయకులు ముగ్గురూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు కావడం ఓ స్పెషాలిటీ. అయితే, ఆ ముగ్గురూ దత్తపుత్రులే కావడం వెరీ వెరీ స్పెషల్. ఆ ముగ్గురిలో ఒకరు దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మరొకరు కరీంనగర్ జెడ్పీ తొలి చైర్మన్ జువ్వాడి చొక్కారావు, ఇంకొకరు […]
దిశ, కరీంనగర్:
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆ ముగ్గురికి ఓ ప్రత్యేకత ఉంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సన్నిహితులుగా, నెహ్రూ కుటుంబానికి హితులుగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆ నాయకులు ముగ్గురూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు కావడం ఓ స్పెషాలిటీ. అయితే, ఆ ముగ్గురూ దత్తపుత్రులే కావడం వెరీ వెరీ స్పెషల్. ఆ ముగ్గురిలో ఒకరు దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మరొకరు కరీంనగర్ జెడ్పీ తొలి చైర్మన్ జువ్వాడి చొక్కారావు, ఇంకొకరు విలక్షణ నాయకుడు మెన్నేని సత్యనారాయణ(ఎమ్మెస్సార్). వారిపై ‘దిశ’ ప్రత్యేక కథనం.
అపర చాణక్యుడు పి.వి.
భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు, బహుభాషా కోవిదుడు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన పి.వి.నరసింహారావు స్వగ్రామం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని లక్నేపల్లి గ్రామంలో తన అమ్మమ్మ ఇంట్లో జన్మించిన పీవీ తన పెద్దనాన్న రంగారావుకు దత్త పుత్రుడు. రాష్ట్రమంత్రిగా, మఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కేబినెట్‌లలో కేంద్ర మంత్రి పదవులు నిర్వహించిన రికార్డు కూడా ఆయన సొంతం. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేండ్లపాటు నడిపిన అపర చాణక్యుడిగా ఖ్యాతికెక్కిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరఫున గాంధేతర కుటుంబం నుంచి ప్రధానిగా పని చేసిన తొలి వ్యక్తి పి.వి. కావడం విశేషం.
సర్పంచ్ నుంచి ఎంపీగా ‘జువ్వాడి’
కరీంనగర్ సమీపంలోని ఇరుకుల్ల గ్రామానికి చెందిన జువ్వాడి చొక్కారావుది జగిత్యాల జిల్లా మల్యాల సమీపంలోని గొర్రెగుండెం గ్రామం. జువ్వాడి కుటుంబంలోనే జన్మించిన చొక్కారావును ఇరుకుల్ల గ్రామానికి చెందిన అదే ఇంటిపేరు గలవారు దత్త పుత్రునిగా తీసుకున్నారు. నిజాయితీకి మారు పేరైన చొక్కరావు కరీంనగర్ తొలి జడ్పీ చైర్మన్‌గా, కరీంనగర్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రి, ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులు అయిన చొక్కారావుకు వ్యవసాయ రంగం అంటే ఎంతో మక్కువ కూడా. ఉమ్మడి ఏపీలో తెలంగాణ రీజియన్ బోర్డు తొలి చైర్మన్‌గా కూడా పనిచేశారు.
విలక్షణ నేత ఎమ్మెఎస్సార్
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన మెన్నేని సత్యనారాయణ రావు కూడా దత్తపుత్రుడే. రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన ఎమ్మెస్సార్ గంగాధర మండలం నారాయణపూర్‌కు దత్తత వెళ్లారు. చీటి కుటుంబంలో జన్మించిన ఆయన మెన్నెని కుటుంబానికి దత్తపుత్రులయ్యారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మెన్నేని ఐదు రాష్ట్రాల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఇప్పుడు ఏఐసీసీలో కీలకంగా ఉన్న కొంతమంది నాయకులు ఎమ్మెస్సార్ ఇన్‌చార్జిగా పనిచేసిన కాలంలో యూత్ కాంగ్రెస్‌లో తిరిగేవారు. ఆర్టీసీ చైర్మన్‌గా, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన సత్యనారాయణ రావు ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులు.
మాటకు కట్టుబడ్డ అరుదైన నాయకుడు
ఇచ్చిన మాటకు కట్టుబడ్డ అరుదైన నాయకుడు ఎమ్మెస్సాఆర్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కలిసి పోటీచేయగా, కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెస్సార్, లోక్‌సభ నుంచి కేసీఆర్ గెలుపొందారు. ఆ తరువాత కేసీఆర్ కేంద్రమంత్రి అయ్యారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం కొంచెం నెమ్మదించిందనే భావన తెలంగాణావాదుల్లో ఉండింది. అప్పుడు ఎమ్మెస్సార్ హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘కేసీఆర్ మంత్రి పదవి తీసుకుని తెలంగాణ ఉద్యమాన్ని పడుకోబెట్టిండు. కాంగ్రెస్‌తోనే కేసీఆర్‌కు పదవి వచ్చింది. ఆయన రాజీనామా చేసి తిరిగి గెలిస్తే తాను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తా’’నంటూ సవాల్ విసిరారు. ఆ వ్యాఖ్య సంచలనమైంది. దీనికి తీవ్రంగా స్పందించిన కేసీఆర్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలోనే కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ గ్రామంలో ‘తెలంగాణ అంటే చెప్పుతో కొడుతా’నంటూ ఓ టీఆర్‌ఎస్ నాయకునిపై ఎమ్మెస్సార్ విరుచుకుపడడం సంచలనం సృష్టించింది. చివరకు కేసీఆర్ రికార్డు స్థాయి మెజార్టీ సాధించడంతో మాటకు కట్టుబడి ఎమ్మెస్సార్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.